మామిడిపండ్లు దొంగిలించాడని దేశ బహిష్కరణ

24 Sep, 2019 15:55 IST|Sakshi

దుబాయ్‌ : మామిడిపండ్లు దొంగతనం చేసినందుకు ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తున్న భారతీయ కార్మికుడికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. సదరు వ్యక్తి వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన 27 ఏళ్ల వ్యక్తి దుబాయి ఎయిర్‌పోర్టులో పనిచేసేవాడు. ప్రయాణికుల లగేజీలను కంటెయినర్‌ నుంచి కన్వేయర్‌ బెల్ట్‌లోకి ఎక్కించడం.. అక్కడి నుంచి కిందకు దించడం అతడి పని.

2017 ఆగస్టు 11న ఎయిర్‌పోర్టులో విధులు నిర్వహిస్తోన్న సమయంలో అతడికి బాగా దాహం వేయడంతో ఒక ప్రయాణికుడికి చెందిన బాక్సు నుంచి రెండు మామిడిపండ్లను దొంగలించాడు. ఈ విషయం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారించగా దొంగతనం​ చేసినట్లు ఒప్పుకున్నాడు. తాను ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆకలి వేసిందని, దాంతో పాటు బాగా దాహం వేయడంతో రెండు మామిడి పండ్లు దొంగతనం చేశానని చెప్పడంతో పోలీసులు అతడి మీద కేసు నమోదు చేశారు.

కాగా సోమవారం ఈ కేసును దుబాయ్‌కు చెందిన పస్ట్‌ ఇన్‌స్టాన్స్‌ కోర్టు విచారించి తమ తుది తీర్పును వెల్లడించింది. అతనికి 5000 దిర్హామ్‌ల జరిమానాతో పాటు దేశ బహిష్కరణ విధించింది. కాగా, ఈ తీర్పుపై 15 రోజుల్లోగా అప్పీల్‌ చేసుకునే అవకాశం అతడికి ఉంటుంది.

మరిన్ని వార్తలు