ఐసోలేషన్‌ కేంద్రం నుంచి సూపర్‌మార్కెట్‌కు..

8 Jul, 2020 12:03 IST|Sakshi

కరోనా రోగి అత్యుత్సాహం

అక్లాండ్‌ : భారత్‌ నుంచి ఇటీవల తిరిగివచ్చి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తి (32) సూపర్‌ మార్కెట్‌కు వెళ్లేందుకు అక్లాండ్‌లోని ఐసోలేషన్‌ కేంద్రం నుంచి అదృశ్యమైన ఘటన వెలుగుచూసింది. ఐసోలేషన్‌ కేంద్రం ఫెన్సింగ్‌ను దాటుకుని ఈ వ్యక్తి మంగళవారం ఉదయం అదృశ్యమయ్యాడని న్యూజిలాండ్‌ హెరాల్డ్‌ వెల్లడించింది. జులై 3న ఢిల్లీ నుంచి వచ్చిన ఈ వ్యక్తికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలిన అనంతరం క్వారంటైన్‌కు తరలించారు. కాగా ఈ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని, ఏ ఒక్కరితోనూ సన్నిహితంగా మెలగలేదని వెల్లడించినట్టు అధికారులు తెలిపారని ఆ కథనం పేర్కొంది. కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిన వ్యక్తి ఐసోలేషన్‌ కేంద్రం నుంచి అదృశ్యమవడం తీవ్రమైన విషయమని ఆరోగ్య మంత్రి క్రిస్‌ హిప్కిన్స్‌ అన్నారు. అతడి చర్యలు స్వార్థపూరితమని, ఆ వ్యక్తిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

కాగా సూపర్‌ మార్కెట్‌లో ఆ వ్యక్తి 20 నిమిషాలు గడిపాడని, 70 నిమిషాల తర్వాత అతడు స్వయంగా ఐసోలేషన్‌ కేంద్రానికి తిరిగి చేరుకున్నాడని హిప్కిన్స్‌ చెప్పారు. ఐసోలేషన్‌ కేంద్రం నుంచి వెళ్లినందుకు అతడికి ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ 2.8 లక్షల జరిమానా విధిస్తారని న్యూజిలాండ్‌ హెరాల్డ్‌ పేర్కొంది. కాగా కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి తమ స్టోర్‌కు వచ్చాడని తెలియడంతో సూపర్‌మార్కెట్‌ సిబ్బంది స్వీయ నియంత్రణలోకి వెళ్లారు. వారందరికీ కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. న్యూజిలాండ్‌లో ఇప్పటివరకూ 1187 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూడగా 23 యాక్టివ్‌ కేసులున్నాయి. వీరంతా ఐసోలేషన్‌ కేంద్రాల్లోనే ఉంటున్నారు.చదవండి : కరోనా చీకటిలో ధారవి

మరిన్ని వార్తలు