రష్యా విక్టరీ పరేడ్‌లో భారత సైనికులు

25 Jun, 2020 06:09 IST|Sakshi

మనకు గర్వకారణం: రాజ్‌నాథ్‌

మాస్కో:  భారత త్రివిధ దళాలకు చెందిన 75 మంది సైనికుల బృందం రష్యా విక్టరీ డే 75వ వార్షికోత్సవ పరేడ్‌లో పాల్గొనడం పట్ల తాను ఎంతగానో గర్విస్తున్నానని, ఇవి తనకు సంతోషకరమైన క్షణాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. రష్యా అధినేత పుతిన్‌ సమక్షంలో రాజధాని మాస్కోలోని చరిత్రాత్మక రెడ్‌ స్క్వేర్‌లో బుధవారం జరిగిన ఈ పరేడ్‌కు రాజ్‌నాథ్‌ హాజరయ్యారు. 1941–1945 మధ్య వీరోచితంగా జరిగిన యుద్ధంలో సోవియట్‌ ప్రజల విజయానికి గుర్తుగా ఈ పరేడ్‌ నిర్వహించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌తోపాటు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్, వైస్‌ అడ్మిరల్‌ హరి కుమార్, భారత రాయబారి డి.బి.వెంకటేశ్‌ వర్మ పాల్గొన్నారు.  రష్యా విక్టరీ పరేడ్‌లో రష్యా సైనిక దళాలతోపాటు 75 మంది భారత సైనికులు ముందుకు నడిచారు. మరో 17 దేశాలకు చెందిన సైనికులు కూడా పాలుపంచుకున్నారు. ఈ పరేడ్‌ను ఏటా మే 9న నిర్వహిస్తారు. కరోనా కారణంగా ఈసారి జూన్‌లో నిర్వహించారు.

మరిన్ని వార్తలు