యూఎస్‌ జైలులో భారత అణుశాస్త్రవేత్త కష్టాలు

18 May, 2017 08:37 IST|Sakshi
యూఎస్‌ జైలులో భారత అణుశాస్త్రవేత్త కష్టాలు

మీరట్‌: ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ తరుణ్‌ కే భరద్వాజ్‌ అనే భారతీయ అణుశాస్త్రవేత్తను టెక్సాస్‌లోని జైలులో వేసి ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది (2016) నుంచి ఆయనను తన విధులకు కూడా హాజరుకానివ్వకుండా అందులో ఉంచి వేధిస్తున్నారు. ఈ విషయంపై భరద్వాజ్‌ స్పందిస్తూ తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. అక్రమంగా జాతివివక్షతో తనను డిటెన్షన్‌ సెంటర్లో ఉంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. ఏ అండ్‌ ఎం అనే విశ్వవిద్యాలయంలో తాను ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని అది సహించలేక జాతి వివక్షతోనే తనను జైలులో పెట్టి విసిగిస్తున్నారని అన్నారు.

‘జాతి వివక్షకు నేనొక బాధితుడిని. ఆ వర్సిటీలో పెద్ద మొత్తంలో చేస్తున్న అవినీతిని నేను ఫిర్యాదు చేశాను. ఆ కేసును వెనక్కు తీసుకోకపోవడంతో నాపై తప్పుడు ఆరోపణలు చేసి విధుల్లో నుంచి తొలగించి ఇలా అరెస్టు చేయించారు. ఒకమ్మాయిని ఇష్టపడటం తప్పేం కాదు.. అయినా, ఆమెను వేధించానంటూ ఆరోపణలు నమోదు చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. భదర్వాజ్‌ కుటుంబం ప్రస్తుతం భారత్‌లోని బులంద్‌ షహర్‌లో ఉంటోంది.

బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ లో పీహెచ్‌డీ పూర్తి చేసిన భరద్వాజ్‌ 2007లో అమెరికాకు పరిశోధకుడిగా వెళ్లాడు. అక్కడే అణుపదార్థాల్లో కెమికల్‌ క్యారక్టరైజేషన్‌లో ప్రత్యేక పరిశోధనను టెక్సాస్‌లోని ఏ అండ్‌ఎం యూనివర్సిటీలో చేశాడు. ఇటీవల ఆయన ప్రొఫైల్‌ కూడా సదరు వర్సిటీ ప్రొఫైల్‌ నుంచి తొలగించారు. ఈ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న సమయంలోనే పలుమార్లు వివిధ ఆరోపణల పేరిట 2015 జనవరి, ఆగస్టు నెలల్లో అతడిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు ద్వారా తెలుసుకున్న వివరాల ప్రకారం అతడిపై ఓ అమ్మాయిని వేధించినట్లు అభియోగాలు నమోదయ్యాయి.

అలాగే, అతడు పనిచేసే సమయంలో చేతికి ధరించాలని చెప్పిన జీపీఎస్‌ యాంకిల్‌ మోనిటరింగ్‌ డివైస్‌ నుంచి అక్రమంగా తీసేసినట్లు అందులో పేర్కొన్నారు. దాంతో 2016 డిసెంబర్‌ 29 నుంచి బ్రాజోస్‌లోని డిటెన్షన్‌ సెంటర్‌లో ఉంచి విచారిస్తున్నారంట. అయితే, అతడి సోదరుడు ప్రసూన్‌ భరద్వాజ్‌ స్పందిస్తూ తన సోదరుడిని జాతి వివక్షకు బలిచేస్తున్నారని చెప్పారు. ఆ యూనివర్సిటీలో చూపిస్తున్న జాతి వివక్షను, అవినీతిని బహిర్గతం చేయడంతోనే అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణ కేసు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించాడు. ఇదిలా ఉండగా, ఈ కేసు విచారణ పూర్తయ్యాక తరుణ్‌ను అమెరికా నుంచి పంపించి వేస్తారని ఆయన తరుపు న్యాయవాది చెప్పారు.

మరిన్ని వార్తలు