చౌకైన వెంటిలేటర్‌ 

27 May, 2020 04:21 IST|Sakshi
దేవేశ్‌ రంజన్, కుముద

భారత దంపతుల కృషి

వాషింగ్టన్‌: కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అమెరికాలోని భారతీయ దంపతులు ఓ వినూత్నమైన, చౌకైన వెంటిలేటర్‌ను తయారు చేశారు. మూడు వారాల వ్యవధిలోనే ఈ వెంటిలేటర్‌కు ఆలోచన చేయడంతోపాటు నమూనా యంత్రాన్ని తయారు చేసిన దేవేశ్‌ రంజన్, కుముదా రంజన్‌..దీనిని భారత్‌తోపాటు, పలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవేశ్‌ రంజన్‌ జార్జియా టెక్‌ వర్సిటీలోని జార్జ్‌ డబ్ల్యూ వుడ్రఫ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో అధ్యాపకుడిగా పనిచేస్తూండగా, కుముదా రంజన్‌ అట్లాంటాలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ‘‘ఈ యంత్రాన్ని వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేస్తే ఒక్కోదానికి రూ. 7,600 (వంద డాలర్లు) వరకూ అవుతుంది. ఐదు రెట్లు ఎక్కువ ధరకు అమ్మినా తయారీదారుకు మంచి లాభాలే వస్తాయి’’అని దేవేశ్‌ రంజన్‌ పీటీఐతో చెప్పారు.

అమెరికాలో సాధారణ వెంటిలేటర్‌ ఖరీదు ఏడెనిమిది లక్షల వరకూ ఉంటుందని చెప్పారు. ఊపిరితిత్తులు బలహీనపడిన సందర్భాల్లో శ్వాసను అందించేందుకు వెంటిలేటర్లు ఉపయోగిస్తారన్నది తెలిసిన విషయమే. శ్వాస వేగం, ఉచ్ఛ్వాస, నిశ్వాసాల్లో గాలి మోతాదు, ఊపిరితిత్తులపై పీడనం వంటి అన్ని అంశాల నిర్వహణకు దేవేశ్, కుముద్‌ రంజన్‌లు ఎలక్ట్రానిక్‌ సెన్సర్లు, కంప్యూటర్‌ నియంత్రణలను ఉపయోగించారు. దీన్ని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో మాత్రం వాడే అవకాశం లేదని, అది మరింత అత్యాధునికమైందని వారు స్పష్టం చేశారు. దేవేశ్‌ స్వస్థలం బిహార్‌లోని పట్నా కాగా, కుముద్‌ రాంచీకి చెందిన వారు. భారత్‌తోపాటు ఆఫ్రికా దేశం ఘనాలో ఈ వెంటిలేటర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు జార్జియా టెక్‌ పూర్వ విద్యార్థులు తమను సంప్రదించినట్లు దేవేశ్‌ తెలిపారు. సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న రిన్యూ గ్రూపు ఈ యంత్రాన్ని మరింత అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉందని ఆ సంస్థ అధ్యక్షుడు ఉత్తరాఖండ్‌కు చెందిన రవీ సజ్వాన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు