కరోనా: న్యూజెర్సీలో ఇద్దరు భారతీయ సంతతి వైద్యులు మృతి

8 May, 2020 17:30 IST|Sakshi

న్యూజెర్సీ: అమెరికాలో భార‌తీయ సంత‌తికి చెందిన వైద్యులు కరోనా బారిన పడి, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. 35 ఏళ్ల‌కు పైగా తాను పని చేస్తున్న క్లారా మాస్ మెడిక‌ల్ సెంట‌ర్‌లోనే సత్యేందర్‌ దేవ్‌ ఖన్నా(78)తో పాటు, ఆయన కుమార్తె ప్రియా ఖన్నా(43) మరణించారు. ఈ విషయాన్ని న్యూజెర్సీ గవర్నర్‌ ఫిల్‌ మార్ఫీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘వారి మరణ వార్త బాధాకరం.. ఇతరుల కోసం వారి జీవితాలను అంకితం చేశారు’ అని ప్రశంసిస్తూ గవర్నర్‌ ట్వీట్‌ చేశారు. ‘అమెరికాలో దశాబ్ధాల క్రితం వైద్యుడిగా స్థిరపడిన సత్యేందర్‌ దేవ్‌ ఖన్నా న్యూజెర్సీలోని పలు ఆసుపత్రులకు శస్త్ర చికిత్స విభాగానికి అధిపతిగా పని చేస్తున్నారు. ఇక ఆయన కుమార్తె ప్రియా ఖన్నా ఆర్‌డబ్ల్యూజే బర్నబాస్‌ ఆరోగ్య విభాగంలో హాస్పిటల్‌ చీఫ్‌ ఆఫ్‌ రెసిడెంట్స్‌గా పనిచేస్తున్నారు’ అని ట్వీట్‌లో తెలిపారు. (కరోనా మృతుల్లో నల్ల జాతీయులే అధికం)

‘‘భారతీయ సంతతికి చెందిన డాక్టర్ సత్యేందర్ దేవ్ ఖన్నా, ఆయన కుమార్తె ప్రియా ఖన్నాలు దశాబ్థాలుగా న్యూజెర్సీలో ప్రధాన వైద్యులుగా పని చేస్తున్నారు. కరోనా నుంచి ఇతరులను కాపాడేందుకు వైద్య సేవలు అందిస్తున్న క్రమంలో వారిద్దరూ ఆ మహమ్మారికి బలైపోయారు. వీరి కుటుంబం ఆరోగ్యం, వైద్యానికి అంకితమైన కుటుంబం. అయితే ఈ మాటలు ఆ కుటుంబానికి వారు లేని లోటును తీర్చలేవు. ఈ తండ్రికూతుళ్ల మరణానికి నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నా’’ అంటూ గవర్నర్ మర్ఫీ ట్వీట్‌లో పేర్కొన్నారు. స‌త్యేంద‌ర్ భార్య కోమ్లిష్‌ను గ‌వ‌ర్న‌ర్ ప‌రామ‌ర్శించారు. కాగా సత్యేందర్‌ మ‌రో ఇద్ద‌రు కూతుర్లు సుగంధ ఖ‌న్నా కూడా వైద్యులుగా ప‌నిచేస్తున్నారు.  (అమెరికాలో చైనా శాస్త్రవేత్త దారుణ హత్య)

మరిన్ని వార్తలు