భారత సంతతి అధికారికి అమ్మాయిలతో ఎర

22 Dec, 2016 13:51 IST|Sakshi
భారత సంతతి అధికారికి అమ్మాయిలతో ఎర
భారీమొత్తంలో డబ్బులు, డ్రగ్స్, లగ్జరీ వెకేషన్లతో పాటు అమ్మాయిల ప్రలోభానికి లోనైనందుకు భారత సంతతికి చెందిన ఓ మాజీ అధికారిపై అమెరికాలో కేసు నమోదైంది. న్యూయార్క్ స్టేట్ కామన్ రిటైర్మెంట్ ఫండ్‌ (ఎన్‌వైసీఆర్‌ఎఫ్‌)కు చెందిన మాజీ డైరెక్టర్, స్ట్రాటజిస్టు అయిన నవనూర్ కంగ్ బిలియన్ల కొద్దీ డాలర్లను బ్రోకర్ డీలర్లకు ఇచ్చారని, వాళ్లు ఆయనకు ఖరీదైన వాచీలు, డ్రగ్స్, నగదుతో పాటు వేశ్యలను, స్ట్రిప్పర్లను సరఫరా చేశారని న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ ప్రీత్ భరారా ఆరోపించారు. ఆయనకు అందిన లంచాలలో దాదాపు రూ. 12 లక్షల విలువైన పనెరాయ్ వాచీ కూడా ఒకటి ఉందన్నారు. ఆయనను ఓరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్‌లాండ్‌లో అరెస్టు చేసి, ఫెడరల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. 
 
కాంగ్ (38) గతంలో టెన్నిస్ క్రీడాకారుడు. 2005, 2006 సంవత్సరాల్లో అంతర్జాతీయ టోర్నమెంట్లలో కూడా ఆడారు. 2014 నుంచి 2016 వరకు ఆయన ఎన్‌వైసీఆర్‌ఎఫ్‌లో ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ విభాగం డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఇది అమెరికాలోనే మూడో అతిపెద్ద పెన్షన్ ఫండ్. ఆయన దాదాపు 3.60 లక్షల కోట్లను స్థిరాదాయం వచ్చే సెక్యూరిటీలలో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంది. కానీ, ఆయన రెండు బ్రోకరేజిలకు చెందిన ఉద్యోగులతో కుమ్మక్కై, లంచాలు తీసుకుని ఈ సొమ్మును వేరే వ్యాపారాల్లోకి మళ్లించారన్నది ఆరోపణ. బ్రోకరేజి ఉద్యోగులలో ఒకరైన డెబోరా కెల్లీ మీద కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఈ ఆరోపణలు రుజువైతే వీరిద్దరికీ 20 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. 
మరిన్ని వార్తలు