కాలిఫోర్నియాలో భారత అధికారి కాల్చివేత

27 Dec, 2018 13:27 IST|Sakshi

కాలిఫోర్నియా : అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన పోలీస్‌ అధికారిని ట్రాఫిక్‌ విధుల్లో ఉండగా గుర్తుతెలియని సాయుధ దుండగుడు కాల్చిచంపాడు. న్యూమాన్‌ పోలీస్‌ విభాగానికి చెందిన కర్పోరల్‌ రొనిల్‌ సింగ్‌ (33) క్రిస్‌మస్‌ రాత్రి ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద విధులు నిర్వహిస్తుండగా, వాహనంపై వచ్చిన దుండగుడు ఆయనపై నేరుగా కాల్పులు జరిపాడు.

ఘటనా స్ధలంలో గాయాలతో పడిఉన్న సింగ్‌ను స్ధానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. కాగా ఆయనపై కాల్పులు జరిపిన వెంటనే పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకునేలోపు నిందితుడు పరారయ్యాడని అధికారులు తెలిపారు. పోలీసులు నిందితుడి ఊహాచిత్రంతో పాటు, వాహనం వివరాలను వెల్లడిస్తూ తమకు అనుమానితుడి సమాచారం అందించాలని కోరారు.

కర్పోరల్‌ సింగ్‌కు భార్య అనామిక, ఐదు నెలల కుమారుడు ఉన్నాడు. కాల్పులు జరిగే కొద్ది గంటల ముందే కర్పోరల్‌ సింగ్‌ క్రి‍స్మస్‌ వేడుకల్లో భార్య, కుమారుడితో ఆనందంగా గడిపారని, వారితో కలిసి ఫోటోలు దిగారని స్ధానికులు తెలిపారు. కాగా సింగ్‌ మృతికి పోలీస్‌ అధికారులు సంతాపం తెలిపారు. కాలిఫోర్నియా గవర్నర్‌ ఎడ్మండ్‌ బ్రౌన్‌ సింగ్‌ భార్య, కుమారుడు, కొలీగ్స్‌కు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తలు