భారత సంతతి వ్యక్తికి ఐన్‌స్టీన్‌ ప్రైజ్‌

15 Oct, 2018 22:14 IST|Sakshi

చికాగో: భౌతికశాస్త్రంలో అత్యున్నత సేవలందించిన వారికి ప్రోత్సాహకంగా అమెరికన్‌ ఫిజికల్‌ సొసైటీ (ఏపీఎస్‌) అందజేస్తున్న ప్రతిష్టాత్మక ‘ఐన్‌స్టీన్‌ ప్రైజ్‌’కు ఈ ఏడాది భారత సంతతి వ్యక్తి ప్రొఫెసర్‌ అభయ్‌ అష్టేకర్‌ ఎంపికయ్యారు. అక్టోబర్‌ 23న జరగనున్న అవార్డుల ప్రదానోత్సవంలో అభయ్‌ ఐన్‌స్టీన్‌ ప్రైజ్‌–2018తోపాటు పదివేల డాలర్లను నగదు ప్రోత్సాహకాన్ని అందుకుంటారు. అభయ్‌ ప్రస్తుతం ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా సేవలందిస్తుండడంతోపాటు పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీలో ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్రావిటేషన్‌ అండ్‌ ది కాస్మోస్‌కి డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు.

ఈ సందర్భంగా అభయ్‌ మాట్లాడుతూ...  ‘ఈ అవార్డు గెలుచుకోవడం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఏపీఎస్‌ అందించే పురస్కారాల్లో ఇదే అత్యంత గౌరవమైంది. భారత్‌లో విద్యనభ్యసిస్తున్నప్పటి నుంచి నాకు భౌతికశాస్త్రంపై ఎంతో ఆసక్తి ఉండేది. మొదట్లో నాకు కేవలం ఒక మరాఠీ మాత్రమే తెలిసేది. పదకొండో తరగతి వరకు మరాఠీ మీడియంలో చదువుకున్నాను. హిందీ, ఇంగ్లిష్‌ భాషలపై పట్టుసాధించిన తర్వాత సంస్కృతిపై భాష ఎలాంటి ప్రభావం చూపుతుందన్న విషయాన్ని తెలుసుకున్నాను. కాలేజీ రోజుల్లో నేర్చుకున్న భౌతికశాస్త్రం ప్రకృతిని అర్థం చేసుకోడానికి ఎంతగానో ఉపయోగపడింద’న్నారు. 1974లో యూనివర్సిటీ ఆఫ్‌ చికాగో నుంచి పీహెచ్‌డీని పూర్తిచేసిన అభయ్‌... లూప్‌ క్వాంటమ్‌ గ్రావిటీ ప్రోగ్రామ్‌పై అనేక పరిశోధనలు చేశారు.   

మరిన్ని వార్తలు