‘శ్వేతసౌధం’ రేసులో కమలా హ్యారిస్‌!

14 Nov, 2018 03:06 IST|Sakshi

వాషింగ్టన్‌: 2020లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలని భారత సంతతి సెనెటర్‌ కమలా హ్యారిస్‌(54) యోచిస్తున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి. నెలక్రితం ఆమె అయోవాలో పర్యటించడం ఈ వాదనలకు బలంచేకూరుస్తోంది. 2020 అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి ప్రైమరీ అక్కడే జరగనుంది. ఆ పర్యటనలో హ్యారిస్‌ ప్రసంగించిన తీరు మాజీ అధ్యక్షుడు ఒబామాను గుర్తుకుతెచ్చిందని మీడియా పేర్కొంది.

అయితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంపై హ్యారిస్‌ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. తాను శ్వేతసౌధం రేసులో ఉన్నట్లు వచ్చిన వార్తల్ని ఆమె కొట్టిపారేయలేదు, ధ్రువీకరించలేదు. భారత సంతతి నుంచి తొలి సెనెటర్‌గా ఎన్నికైన కమలా హ్యారిస్‌ను ‘ఫిమేల్‌ ఒబామా’ అని పిలుస్తారు. గత రెండేళ్లలో డెమొక్రటిక్‌ పార్టీలో మంచి గుర్తింపు దక్కించుకున్న ఆమె..అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు దీటుగా ఎదిగారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ట్రంప్‌ను హ్యారిస్‌ సులువుగా ఓడిస్తారని ఓ సర్వేలో తేలడం విశేషం.

మరిన్ని వార్తలు