అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్‌ పోటీ

22 Jan, 2019 04:40 IST|Sakshi
కమలా హ్యారిస్‌

ప్రకటించిన భారతీయ–అమెరికన్‌ సెనెటర్‌  

వాషింగ్టన్‌: భారతీయ అమెరికన్‌ సెనెటర్‌ కమలా హ్యారిస్‌ వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అమెరికాలో పౌర హక్కుల కోసం పోరాడిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ డే రోజున ఆమె ఈ ప్రకటన చేశారు. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ మహాత్మా గాంధీ నుంచి స్ఫూర్తి పొందారనీ, తనకు లూథర్‌ కింగ్‌ స్ఫూర్తి కాబట్టి ఆ సందర్భంగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నానని కమలా హ్యారిస్‌ తెలిపారు.

కమల తల్లి తమిళనాడుకు చెందిన మహిళ, తండ్రి జమైకాకు చెందిన ఆఫ్రికన్‌–అమెరికన్‌. వీరిద్దరూ అమెరికాలో చదువుకోవడానికి వచ్చినప్పుడు పెళ్లి చేసుకుని కమల, ఆమె చెల్లెలు మాయ పుట్టాక కొన్నాళ్లకు విడిపోయారు. అలాగే కాలిఫోర్నియా నుంచి సెనెటర్‌గా ఎన్నికైన తొలి నల్లజాతీయురాలు ఆమెనే. కమల తాజా ప్రకటనలో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళల సంఖ్య నాలుగుకు చేరింది. ఎలిజబెత్‌ వారెన్, కిర్‌స్టెన్‌ గిల్లిబ్రాండ్, తులసీ గబ్బార్డ్‌లు ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. వీరిలో ఎవరు గెలిచినా అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే తొలి మహిళగా చరిత్ర సృష్టిస్తారు. 

మరిన్ని వార్తలు