మలేసియా మంత్రిగా తొలి భారతీయ సిక్కు

22 May, 2018 15:49 IST|Sakshi
గోవింద్‌సింగ్‌ దేవ్‌ (ఫైల్‌ ఫోటో)

కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న గోవింద్‌ సింగ్‌ దేవ్‌

కౌలాలంపూర్‌: మలేసియా కేబినెట్‌లో భారతీయ సంతతికి చెందిన సిక్కు వ్యక్తికి చోటు లభించింది. మలేసియా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న తొలి ఇండో- మలేసియా సిక్కు వ్యక్తిగా గోవింద్‌సింగ్‌ దేవ్‌ రికార్డు సృష్టించారు. పక్కాటన్ హరప్పన్ సంకీర్ణ మంత్రివర్గంలో గోవింద్‌సింగ్‌ సమాచార, మల్టీమీడియా శాఖ మంత్రిగా నియమితులైయారు.

గోవింద్‌సింగ్‌తో పాటు డెమోక్రాటిక్‌ యాక్షన్‌ పార్టీకి చెందిన మరో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఎం.కిలసేగరన్‌ మానవ వనరులశాఖ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. గోవింద్‌సింగ్‌ మలేసియాలోని పుచుంగ్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ప్రతినిథ్యం వహిస్తున్నారు. గోవింద్‌ తండ్రి కర్పాల్‌ సింగ్‌ మలేసియాలో ప్రముఖ న్యాయవాది, రాజకీయవేత్త.

గోవింద్‌సింగ్‌ 2008లో మొదటిసారి మలేసియా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఆ తరువాత 2013, 2018లో జరిగిన ఎన్నికల్లో వరుస విజయాలను నమోదు చేశారు. గోవింద్‌సింగ్‌ దేవ్‌కు మంత్రి వర్గంలో చోటు లభించడంతో సిక్కు సామాజిక వర్గం నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా మలేసియా జనాభాలో లక్ష జనాభా సిక్కు సామాజిక వర్గానికి చెందిన వారున్నారు.

మరిన్ని వార్తలు