భారత్‌ కన్నా రష్యా జైళ్లే నయం

6 Dec, 2017 04:03 IST|Sakshi

లండన్‌: భారత జైళ్ల వ్యవస్థ రష్యాలో కన్నా ఘోరంగా ఉంటుందని విజయ్‌ మాల్యా తరఫున లండన్‌ కోర్టులో కేసు వాదిస్తున్న న్యాయవాదుల బృందం మంగళవారం వ్యాఖ్యానించింది. భారత్‌లో బ్యాంకులకు రూ.9 వేల కోట్లు ఎగ్గొట్టి లండన్‌ పారిపోయిన విజయ్‌ మాల్యాను తిరిగి అప్పగించే విషయమై అక్కడి కోర్టులో సోమవారం నుంచి విచారణ ప్రారంభమవడం తెలిసిందే. మాల్యా తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ‘జైలులో విజయ్‌ మాల్యాకు సురక్షిత వాతావరణం కల్పిస్తామని భారత అధికారులు చెబుతున్నా అందుకు అనువైన యంత్రాంగమేదీ అక్కడ లేదు.

కోర్టు ఆదేశాలు ఉల్లంఘనకు గురైనప్పుడు కూడా పరిస్థితిని అక్కడి ప్రభుత్వం సరిదిద్దడం లేదు. రష్యాలో జైళ్లు భారత్‌లో కన్నా ఎంతో మెరుగ్గా ఉంటాయి’ అని న్యాయమూర్తి ఎమ్మా అర్బుత్‌నాట్‌కు తెలిపారు. సాధారణంగా రష్యాలో ఖైదీల అప్పగింత కేసులు అక్కడి జైళ్లలో ఉండే సదుపాయాలపై ఆధారపడి ఉంటాయి. అలాంటి దేశంతో భారత్‌ను ఎలా పోలుస్తారని న్యాయమూర్తి ప్రశ్నించగా... కోర్టు ఆదేశాలు జైలులో ఉల్లంఘనకు గురవుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు కనీసం రష్యాలో అయితే అంతర్జాతీయ నిపుణులను అనుమతిస్తారనీ, కానీ భారత్‌లో ఆ అవకాశం కూడా ఉండదని వివరించారు.  

మరిన్ని వార్తలు