హమ్మయ్యా.. ఆ 22మంది భారతీయులు సేఫ్

6 Feb, 2018 11:32 IST|Sakshi
సముద్రపు దొంగలు హైజాక్ చేసిన ఓడ

సాక్షి, న్యూఢిల్లీ : సముద్రపు దొంగల చెర నుంచి 22 మంది భారతీయులు విడుదలయ్యారు. దీంతో ఆ భారత సెయిలర్ల కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఓడలో ఐదు రోజుల చెర అనంతరం దొంగలు వీరిని విడిచి పెట్టినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ మలిని శంకర్ మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం ఓడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం కొనసాగిస్తున్నట్లు సమాచారం. రూ. 52 కోట్లు విలువైన గ్యాసోలిన్‌ను రవాణా చేస్తున్న భారతీయ ఓడ గత ఐదు రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన విషయం తెలిసిందే.

వాయవ్య ఆఫ్రికా తీరంలోని బెనిన్‌ ఓడరేవు నుంచి బయల్దేరిన ఎంటీ మెరైన్‌ ఎక్స్‌ప్రెస్‌ బెనిన్‌లోని గినియా తీరంలో హైజాక్ అయింది. ఈ ఓడలో 22 మంది భారత సిబ్బంది ఉన్నారు. వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో గ్యాసోలిన్‌ను చోరి చేసేందుకే షిప్‌ను హైజాక్‌ చేసివుంటారని అధికారులు భావించారు. ఆచూకీ లేకుండా పోయిన ఓడ కోసం నైజీరియా, బెనిన్‌ దేశాల సాయంతో భారత్‌ గాలింపు చర్యలు చేపట్టగా చివరికి సముద్రపు దొంగలు ఓడ సిబ్బందిని విడిచిపెట్టారు. కాగా, గత నెలలో ఇదే ప్రాంతంలో ఓ భారతీయ నౌక హైజాక్‌కు గురైంది. ఏమైనా భారీ మొత్తంలో నగదు చెల్లించిన తర్వాత బంధీలను దొంగల ముఠా విడిచిపెట్టి ఉండొచ్చునని ప్రచారం జరుగుతోంది.

 

మరిన్ని వార్తలు