ఆక్స్‌ఫర్డ్ బోధన చెత్త: భారతీయ విద్యార్థి కేసు

12 Dec, 2016 14:53 IST|Sakshi
ఆక్స్‌ఫర్డ్ బోధన చెత్త: భారతీయ విద్యార్థి కేసు
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అంటే అందరూ ఒక ఆరాధనాభావంతో చూస్తారు. అక్కడ చదువుకోవడం అంటే పూర్వజన్మ సుకృతం అనుకుంటారు. కానీ, అలాంటి యూనివర్సిటీలో బోధన పరమ బోరింగ్‌గా ఉందని, దానివల్ల తనకు డిగ్రీలో సెకండ్ క్లాస్ వచ్చి, న్యాయవాదిగా తన కెరీర్‌లో సంపాదన కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపిస్తూ ఒక భారతీయ విద్యార్థి కేసు వేశాడు. ఫైజ్ సిద్దిఖీ అనే యువకుడు యూనివర్సిటీలోని బ్రాసెనోస్ కాలేజిలో ఆధునిక చరిత్ర చదివాడు. అక్కడి టీచర్లు బోధనలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లండన్ హైకోర్టులో కేసు దాఖలు చేశాడు. ముఖ్యంగా తాను ప్రత్యేక సబ్జెక్టుగా తీసుకున్న ఇండియన్ ఇంపిరీయల్ హిస్టరీ బోధన ఘోరంగా ఉందన్నాడు. ఈ కేసులో తీర్పు ఈ నెలాఖరులో వచ్చే అవకాశం ఉంది.
 
1999-2000 విద్యాసంవత్సరం సమయంలో ఏషియన్ హిస్టరీ బోధించేవాళ్లు మొత్తం ఏడుగురు ఉండగా అందులో నలుగురు సెలవులో ఉన్నారని, అందువల్ల మిగిలినవాళ్లు కూడా సరిగా చెప్పలేదని సిద్దిఖీ తరఫు న్యాయవాది రోజర్ మలాలియూ వాదించారు. తాను ఆక్స్‌ఫర్డ్‌లో చదివితే తనకు మంచి ర్యాంకులు వచ్చి, అంతర్జాతీయ కమర్షియల్ లాయర్‌గా పెద్దజీతం అందుకుంటానని భావించానని సిద్దిఖీ అన్నాడు. దక్షిణ భారత చరిత్రలో నిపుణుడైన డేవిడ్ వాష్‌బ్రూక్ చాలా బోరింగ్‌గా చెప్పారని తెలిపాడు. అయితే.. సిబ్బంది కొరత కారణంగానే ఆయనపై భరించలేనంత ఒత్తిడి కలిగిందని మలాలియూ చెప్పారు. అయితే వాష్‌బ్రూక్ మీద తాము వ్యక్తిగత ఆరోపణలు ఏమీ చేయడంలేదని, యూనివర్సిటీ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని అన్నారు. సిద్దిఖీ పరీక్షలలో తన ఫలితాలు చూసుకుని తీవ్రమైన డిప్రెషన్, నిద్రలేమికి గురయ్యాడని, అందువల్ల ఎక్కువసేపు సమర్థంగా పనిచేయలేకపోతున్నాడని కూడా వాదించారు. 
మరిన్ని వార్తలు