పలువురు భారతీయ విద్యార్థుల అరెస్ట్

30 Jan, 2019 22:58 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా మిచిగాన్ రాష్ట్రంలో ఒక ఫేక్ యూనివర్సిటీ బండారం బట్టబయలైంది. అందులో అడ్మిషన్ పొందిన పలువురు భారతీయ విద్యార్థులను యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) అరెస్టు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. అయితే, మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ లో కొనసాగుతున్న యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్‌లో అడ్మిషన్ తీసుకుని తద్వారా పొందిన ధ్రువపత్రాలు బోగస్ గా గుర్తించిన కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్ మెంట్ బుధవారం పలువురు విద్యార్థులను అరెస్టు చేసినట్టు తెలిసింది. ఈరోజు ఉదయం అరెస్టు చేసిన వారిలో నలుగురు భారతీయ విద్యార్థులు ఉన్నట్టు అక్కడి వర్గాలు చెప్పాయి.

కేవలం అమెరికాలో కొనసాగేందుకు వీలుగా ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందుతున్నారని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) గుర్తించి తనిఖీలు నిర్వహించింది. తనిఖీల సందర్భంగా మొత్తం యూనివర్సిటీయే ఫేక్ అని బయటపడింది. మిడిల్ ఈస్ట్ కు చెందిన పలువురు వ్యక్తులు ఈ ఫేక్ యూనివర్సిటీని నడిపిస్తున్నారని, తరగతులు నిర్వహించకపోవడం, ఏ డిపార్ట్‌మెంట్‌లో కూడా ప్రొఫెసర్లు లేకపోవడం వంటి అనేక విషయాలు తనిఖీల్లో బయటపడినట్టు తెలిసింది. యూనివర్సిటీకి అక్రిడిటేషన్ కూడా లేదని బయటపడినట్టు సమచారం అందింది. యూనివర్సిటీ సెవిస్ ఉల్లంఘన కింద అట్లాంటా జార్జియాలో నలుగురు భారతీయ విద్యార్థులను అరెస్టు చేసినట్టు తెలిసింది. అయితే, మొత్తంగా ఎంతమందిని అరెస్టు చేసింది? ఎలాంటి చర్యలకు ఉపక్రమించారన్న పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

మరిన్ని వార్తలు