అమెరికాలో ఇద్దరు భారత విద్యార్ధుల మృతి

3 Dec, 2019 08:10 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికాలోని టెనెస్సీ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారత విద్యార్ధులు మరణించారు. థ్యాంక్స్‌ గివింగ్‌ డే రోజు జరిగిన ఈ ఘటనలో ప్రమాదానికి కారణమైన పికప్‌ ట్రక్‌ యజమాని పోలీసులకు లొంగిపోయాడని అధికారులు వెల్లడించారు. మరణించిన ఇద్దరు విద్యార్ధులు టెన్నెస్సీ స్టేట్‌ యూనివర్సిటీలో ఫుడ్‌ సైన్స్‌ అభ్యసిస్తున్న జుడీ స్టాన్లీ (23) వైభవ్‌ గోపిశెట్టి (26)లుగా గుర్తించారు. దక్షిణ నాష్‌విలేలో నవంబర్‌ 28 రాత్రి నిస్సాన్‌ సెంట్రాలో వెళుతున్న వీరిద్దరినీ ట్రక్‌ ఢీకొనడంతో మరణించారని స్ధానిక పోలీసులు తెలిపారు. స్టాన్లీ ఫుడ్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేస్తుండగా, గోపిశెట్టి పీహెచ్‌డీ చేస్తున్నారని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. వీరిద్దరి మరణం వర్సిటీలో విషాదం నింపిందని ఇది దురదృష్టకర ఘటన అని అధికారులు ఓ ప్రకటలో తెలిపారు. ప్రమాదానికి కారణమైన పికప్‌ ట్రక్‌ ఓనర్‌ డేవిడ్‌ టోర్స్‌పై లుక్‌అవుట్‌ నోటీస్‌ జారీకాగా, ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరోవైపు ఇండియాలో జరిగే వీరిద్దరి అంత్యక్రియలకు వర్సిటీ విద్యార్ధులు గోఫండ్‌ మీ ద్వారా విరాళాలు సేకరించారు. ఎన్నో కలలతో అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వీరి అకాల మరణం తమను తీవ్రంగా కలిచివేసిందని పలువురు ప్రవాస భారతీయులు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తలు