కొత్త వీసా విధానాన్ని ప్రకటించనున్న ఆస్ట్రేలియా

31 Oct, 2013 22:47 IST|Sakshi

మెల్‌బోర్న్: విద్యార్థి వీసాలను మరింత సులభతరం చేస్తూ ఆస్ట్రేలియా కొత్త ప్రభుత్వం త్వరలోనే కొత్త వీసా విధానాన్ని ప్రకటించనుంది. భారత్, చైనా వంటి దేశాలకు చెందిన విద్యార్థులను పెద్దసంఖ్యలో ఆకర్షించడం ద్వారా వందకోట్ల డాలర్ల విద్యా పరిశ్రమకు ఊతమిచ్చే లక్ష్యంతో కొత్త వీసా విధానాన్ని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. గత లేబర్ పార్టీ ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న విద్యా పరిశ్రమను పునరుద్ధరించేందుకు కొత్త సంకీర్ణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆస్ట్రేలియా విద్యాశాఖ మంత్రి క్రిస్టఫర్ పైనే, ఇమిగ్రేషన్ మంత్రి స్కాట్ మారిసన్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

 

విద్యార్థి వీసాలను మరింత సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు ప్రకటించారు. ఆస్ట్రేలియాలో చదువుకునే విదేశీ విద్యార్థుల్లో చైనా, భారత్‌లకు చెందిన వారే ఎక్కువ. కొన్నేళ్ల కిందట భారత్ సహా ఆసియా దేశాల విద్యార్థులపై దాడులు పెరగడంతో ఆస్ట్రేలియాలో విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు భారత్, చైనాలను ‘హై రిస్క్’ దేశాలుగా గుర్తించిన గత లేబర్ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా భారత విద్యార్థుల వీసాల్లో దాదాపు 60 శాతం వరకు తిరస్కరణకు గురయ్యాయి. ఈ పరిస్థితిని చక్కదిద్ది, విద్యా పరిశ్రమను పునరుద్ధరించేందుకు విద్యార్థి వీసాలను సులభతరం చేయాలని ఆస్ట్రేలియా కొత్త ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వార్తలు