పైరేటెడ్ సాఫ్ట్‌వేర్ వాడినందుకు.. 66 లక్షల జరిమానా

29 Dec, 2015 12:31 IST|Sakshi
పైరేటెడ్ సాఫ్ట్‌వేర్ వాడినందుకు.. 66 లక్షల జరిమానా

పైరేటెడ్ సాఫ్ట్‌వేర్ వాడినందుకు ఓ వస్త్ర తయారీ సంస్థ రూ. 66 లక్షల జరిమానా కట్టాల్సి వస్తోంది. అది కూడా నెలరోజుల్లోపే చెల్లించాలి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గల ప్రతిభా సింటెక్స్ లిమిటెడ్ అనే కంపెనీ వాల్‌మార్ట్ సహా పలు అగ్రశ్రేణి అమెరికన్ కంపె నీలకు దుస్తులు ఎగుమతి చేస్తుంది. ఈ కంపెనీ అక్రమ వ్యాపార అలవాట్లు పాటించిందని, దానివల్ల కాలిఫోర్నియాలోని వస్త్ర కంపెనీలకు నష్టం వాటిల్లిందని, అమెరికా సాఫ్ట్‌వేర్ కంపెనీలు కొత్త ఉత్పత్తులను తయారు చేయలేకపోతున్నాయని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కమలా హారిస్ తెలిపారు. పైరేటెడ్ సాఫ్ట్‌వేర్ వాడటమే ఆ కంపెనీ చేసిన నేరం. ఇందుకు గాను కోర్టు ఆ కంపెనీకి లక్ష డాలర్లు (భారత కరెన్సీలో రూ. 66 లక్షలు) జరిమానా విధించింది. నెల రోజుల్లోగా ఆ మొత్తం చెల్లించాలని చెప్పింది.

ప్రపంచంలో ఎవరు మేధోసంపత్తిని దొంగిలించినా కాలిఫోర్నియా రాష్ట్రం వాళ్లను దోషులుగా నిర్ణయిస్తుందని కమలా హారిస్ చెప్పారు. ఎడోబ్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థల ఉత్పత్తులకు లైసెన్సు ఫీజు చెల్లించకుండానే ఆయా కంపెనీల సాఫ్ట్‌వేర్‌లను ప్రతిభా సింటెక్స్ వాడుతోందని 2013లో కేసు నమోదైంది. వీటితోపాటు ఏఐఎంఎస్ 360 అనే సాఫ్ట్‌వేర్‌ను కూడా ప్రతిభా సింటెక్స్ వాడింది. దాన్ని ప్రధానంగా వస్త్ర ఉత్పత్తిదారులు, హోల్‌సేలర్లు, దిగుమతిదారులు ఎక్కువగా వాడతారు. దానికి కూడా లైసెన్సు ఫీజు కట్టలేదు. అందుకే ఆ కంపెనీ తరఫున కమలాహారిస్ ఈ కేసు దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు