అమెరికాలో ఇండియన్ మహిళపై గృహ హింస

5 Sep, 2017 13:39 IST|Sakshi
అమెరికాలో ఇండియన్ మహిళపై గృహ హింస
సాక్షి, హౌస్టన్:  భర్త, అతని తల్లిదండ్రుల చేతిలో చిత్రహింసలకు గురవుతున్న మహిళను, ఆమె ఏడాది చిన్నారిని అమెరికన్ పోలీసులు కాపాడారు. భార్యను హింసించేందుకు ప్రత్యేకంగా తల్లిదండ్రులను అమెరికాకు పిలిపించుకుని మరీ ఆ భర్త దాడి చేయటం ఇక్కడ విశేషం. 
 
ఇండియాకు చెందిన 33 ఏళ్ల సిల్కీ గెయింద్, దేవబిర్ కల్సితో పెళ్లాయ్యాక అమెరికా వెళ్లిపోయింది. వీరికి ఏడాది పాప కూడా ఉంది. అయితే గత కొంత కాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తున్నాయి. ఈ క్రమంలో తన మాట వినని భార్యకు బుద్ధి చెప్పాలని తల్లిదండ్రులను ఫోన్ చేయించి మరీ అమెరికాకు రప్పించుకున్నాడు. పథకం ప్రకారం శనివారం కావాలనే భార్యతో గొడవపెట్టుకున్నాడు. ఆపై ఆమెపై చెయ్యి చేసుకోబోతుండగా ప్రతిఘటించింది. 
 
అవకాశం కోసం ఎదురుచూస్తున్న అతని తల్లిదండ్రులు సిల్కీకి పై దాడికి దిగారు. ఆపై ముగ్గురూ కలిసి ఆమెపై పిడిగుద్దులు కురిపించారు. ఆ సమయంలో ఆమె కూతురిని ఎత్తుకుని ఉండటంతో ఆ చిన్నారికి కూడా గాయాలయ్యాయి. చివరకు ఆమెను చంపుతామంటూ కత్తితో బెదిరించిన కల్సి తండ్రి ఆమెను ఓ గదిలో పడేశాడు. ఎలాగోలా యువతి తన తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేయగా, ఆమె తల్లి ఫ్లోరిడా పోలీసులకు సమాచారం చేరవేసింది. 
 
హౌస్టన్ లో ఆమె ఉంటున్న నివాసానికి వచ్చిన పోలీసు అధికారి ఎంత సేపటికి తలుపు బాదిన ఎవరూ తలుపు తీయకపోవటంతో అనుమానం వచ్చింది. చివరకు లోపలి నుంచి సిల్కీ గట్టిగా కాపాడాలంటూ అరవటంతో అధికారి డోర్ బద్ధలు కొట్టుకుని మరీ లోపలికి వెళ్లారు. తీరా చూస్తే ఆమె తీవ్ర గాయాలపాలైన ఉండటంతో నిందితులను అరెస్ట్ చేసి హిల్స్ బర్గ్ జైలుకు తరలించారు. దేవబిర్ కు అతని, తల్లిదండ్రులకు దేశ బహిష్కరణ శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు సిల్కీకి, ఆమె కూతురికి చికిత్స అందజేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని వార్తలు