ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ప్రాజెక్టులో భారత మహిళ 

29 Apr, 2020 00:06 IST|Sakshi

లండన్‌: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ పరిశోధనల్లో భారత్‌కు చెందిన చంద్ర దత్తా (34) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈమె ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్‌లో క్వాలిటీ అస్యూరెన్స్‌ మేనేజర్‌గా ఉన్నారు. వర్సిటీ పరిశోధకులు తయారు చేసిన వ్యాక్సిన్‌ వారం క్రితం మొదటి దశ హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకుంది. ఈ వ్యాక్సిన్‌ సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నాటికి అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు. చంద్రదత్తా కోల్‌కతాలో బయో టెక్నాలజీలో బీటెక్‌ పూర్తి చేశారు. అనంతరం ఎమ్మెస్సీ బయోసైన్స్‌ పూర్తి చేయడానికి 2009లో బ్రిటన్‌ వెళ్లారు. ఆక్స్‌ఫర్డ్‌లో వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో పాలు పంచుకునే ముందు ఆమె పలు ఉద్యోగాలు చేశారు.

ఆక్స్‌ఫర్డ్‌లో క్వాలిటీ అస్యూరెన్స్‌తోపాటు, ప్రయోగాల్లో సరైన నాణ్యతా ప్రమాణాలు, విధానాలు పాటిస్తున్నదీ లేనిదీ చంద్ర దత్తా పర్యవేక్షిస్తుంటారు. ‘కోవిడ్‌ వ్యాక్సిన్‌ రూపకల్పనలో పాలుపంచుకోవడం సంతోషం కలిగిస్తోంది. గత నెలంతా మేమెంతో ఒత్తిడి అనుభవించాం. అయితే వ్యాక్సిన్‌ను త్వరగా తయారు చేయగలిగాం’ అని ఆమె చెప్పారు. పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌లో సెప్టెంబర్, అక్టోబర్‌లలో భారీ స్థాయిలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. సాధారణంగా వ్యాక్సిన్‌ తయారీకి మూడు నుంచి నాలుగేళ్లు పడుతుందని, అయితే కరోనా వ్యాక్సిన్‌ను నెలల వ్యవధిలోనే తయారు చేయగలిగామని చెప్పారు. కరోనాపై ఇప్పటి వరకు 600 వ్యాక్సిన్లు తయారు చేశామని, మరో 1000 వ్యాక్సిన్లు కూడా చేసిన అనంతరం భారీ స్థాయిలో ఉత్పత్తి చేపడతామని చెప్పారు. 

>
మరిన్ని వార్తలు