టాయిలెట్‌ గోడలపై హిందూ దేవుళ్లు!

20 Nov, 2018 09:36 IST|Sakshi
అంకితా మిశ్రా షేర్‌ చేసిన ఫొటో

న్యూయార్క్‌ : ఓ పబ్‌ టాయిలెట్‌ గోడలపై హిందూ దేవుళ్లను చూసి ఖంగుతిన్న ఓ భారత సంతతికి చెందిన అమెరికా మహిళా... ఆ పబ్‌ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారికి మెయిల్‌ ద్వారా భారత సంస్కృతి, హిందూ దేవుళ్ల సంప్రదాయం గురించి తెలియజేసింది. ఆమె మెయిల్‌కు స్పందించిన సదరు పబ్‌ నిర్వాహకులు క్షమాపణలు చెప్పడంతో పాటు టాయిలెట్‌ గోడలపై ఆ చిత్రాలను తొలిగిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్‌ మీడియా ఖాతాలో వివరించింది.

వివరాల్లోకి వెళ్తే.. అంకితా మిశ్రా అనే భారత సంతతి మహిళా.. కొద్ది రోజుల క్రితం స్నేహితులతో కలిసి న్యూయార్క్‌, బష్విక్‌లోని హాస్‌ ఆఫ్‌ ఎస్‌ పబ్‌కు వెళ్లింది. అక్కడ చిందేస్తూ ఆస్వాదించింది. ఇంతలో టాయిలెట్‌కు వెళ్లిన ఆమె షాక్‌కు గురైంది. టాయిలెట్‌లోని గోడలపై హిందూ దేవుళ్లు.. వినాయక, సరస్వతి, కాళీ, శివుడి చిత్రాలున్నాయి. దీంతో ఇది దేవాలయమా లేక టాయిలెటా? అని ఆశ్చర్యపోయింది. వెంటనే అక్కడ ఉండలేక బయటకు వచ్చి.. సదరు పబ్‌కు మెయిల్‌ పెట్టింది. ఆ చిత్రాలన్ని హిందూ దేవుళ్లని, భారత్‌లో ఆరాధ్యదైవంగా భావిస్తారని వివరించింది. దీనికి స్పందించిన సదరు పబ్‌ నిర్వాహకులు.. ఈ విషయం తమకు తెలియదని, ఇతర ప్రాంతాల్లో ఈ చిత్రాలును చూసి.. అందంగా ఉన్నాయి కదా అని ఇక్కడ వేయించామని క్షమాపణలు తెలిపారు. ఆ చిత్రాలను తొలిగిస్తామని కూడా స్పష్టం చేశారు. ఇక ఇలా హిందూ దేవుళ్లను అవమానించడం ఇదే తొలిసారేం కాదు.. గతంలో చెప్పులపై.. టాయిలెట్‌ సీట్స్‌పై కూడా వేసిన ఘటనలున్నాయి.

మరిన్ని వార్తలు