పాక్ కోర్టులో భారత్ విజయం

24 May, 2017 14:49 IST|Sakshi
పాక్ కోర్టులో భారత్ విజయం

అప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్న పాకిస్తానీ వ్యక్తి ఒకరు తనను బలవంతంగా పెళ్లి చేసుకుని ఆ దేశానికి తీసుకొచ్చారని, తనను తన మాతృదేశమైన భారత్‌కు పంపేయాలంటూ ఉజ్మా అనే భారతీయ మహిళ పెట్టుకున్న దరఖాస్తును ఇస్లామాబాద్ హైకోర్టు ఆమోదించింది. భారతదేశానికి తిరిగి వెళ్లేందుకు ఉజ్మాకు అనుమతి ఇచ్చింది. ఆమె భర్త తాహిర్ అలీ నుంచి స్వాధీనం చేసుకున్న ఉజ్మా ఒరిజినల్ ఇమ్మిగ్రేషన్ ఫాంను జస్టిస్ మొహసిన్ అఖ్తర్ కయానీ నేతృత్వంలోని హైకోర్టు బెంచి.. ఆమెకు తిరిగి ఇచ్చింది. దాంతో ఉజ్మా స్వదేశానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. వాఘా సరిహద్దు దాటేవరకు ఆమెకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోర్టు ఆదేశించింది.

ఉజ్మాను విడిగా కలిసేందుకు అనుమతి ఇవ్వాలని తాహిర్ కోరగా, తన చాంబర్‌లో కలవొచ్చని జస్టిస్ కయానీ చెప్పారు. కానీ, అతడిని కలిసేందుకు ఉజ్మా నిరాకరించారు. ఈ నెలాఖరుతో ఉస్మా వీసా గడువు ముగిసిపోతుంది కాబట్టి, ఈలోపే తనను భారత్ పంపేలా చూడాలన్నారు. తాహిర్‌తో తనకు బలవంతంగా పెళ్లి చేశారని, తనపై ఒత్తిడి చేసి నిఖానామా మీద సంతకం చేయించారని అంతకుముందు ఉజ్మా కోర్టుకు తెలిపారు. తుపాకి చూపి బెదిరించి తన పెళ్లి చేశారని చెప్పారు. దాంతో తనకు ఈ పెళ్లి నుంచి విముక్తి కల్పించి భారత్ పంపాలని కోరగా, ఇప్పుడు కోర్టు అందుకు అంగీకరించింది.

మరిన్ని వార్తలు