భారతీయులపై కోవిడ్‌ పడగ

24 Apr, 2020 03:29 IST|Sakshi
బొలీవియాలో లాక్‌డౌన్‌తో నిర్మానుష్యంగా మారిన రోడ్లపైకొచ్చిన లామాలు

బ్రిటన్‌లో కరోనాతో 420 మంది మృతి

అమెరికాలో పిల్లులకూ కరోనా

డబ్ల్యూహెచ్‌వోకు చైనా అదనపు గ్రాంట్‌

లండన్‌/న్యూయార్క్‌/ఇస్లామాబాద్‌/బీజింగ్‌: బ్రిటన్‌లోని భారతీయులపై కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా పడింది. దేశంలో కోవిడ్‌ కారణంగా మరణించిన వారిలో కనీసం 3 శాతం మంది భారతీయ సంతతి వారు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బ్రిటన్‌లోని ఆసుపత్రుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. ఈనెల 17వ తేదీ వరకు 13,918 మంది కోవిడ్‌తో మరణించగా ఇందులో 16.2 శాతం మంది నల్లజాతీయులు, ఆసియా, మైనార్టీ తెగల నేపథ్యం ఉన్న వారు.

ఈ వర్గానికి చెందిన వారు మొత్తం 2,252 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతీయ సంతతికి చెందిన వారు ఇందులో 420 మంది ఉన్నారు. దేశంలో మైనార్టీ నేపథ్యమున్న వారి సంఖ్య 13 శాతం మాత్రమే అయినా కరోనా వైరస్‌తో మరణాల్లో ఇంతకంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. మృతుల్లో శ్వేత జాతీయులు 73.6 శాతం ఉండగా, మిశ్రమ నేపథ్యమున్న వారు 0.7 శాతమని, ఇతర ఆసియా దేశాలకు చెందిన వారు 1.6 శాతమని సమాచారం. కోవిడ్‌ బాధితులకు చికిత్సచేసే వైద్య సిబ్బందిలో 69 మంది వైరస్‌కు బలయ్యారు.

రెండు పిల్లులకు వైరస్‌ పాజిటివ్‌
కోవిడ్‌ నెమ్మదిగా జంతువులకు విస్తరిస్తోంది. న్యూయార్క్‌లో రెండు పిల్లులు ఈ వ్యాధి బారిన పడ్డాయని అధికారులు ప్రకటించారు. పెంపుడు జంతువులకు ఈ వైరస్‌ సోకడం ఇదే తొలిసారి అని తెలిపారు. న్యూయార్క్‌ రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ పిల్లులు ఉన్నట్లు చెప్పారు. వైరస్‌ సోకిన ఒక పిల్లి యజమాని కుటుంబంలో వైరస్‌ లేదు. ఇంకో పిల్లి యజమాని కోవిడ్‌ బాధితుడు.

అమెరికాలో 1,738 మంది మృతి
అమెరికాలో కరోనా వైరస్‌ బుధవారం 1,738 మందిని బలితీసుకుంది. అంతకు ముందు రోజుతో పోలిస్తే ఇది స్వల్పంగా తక్కువని జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ తెలిపింది. అమెరికాలో కరోనా కారణంగా ఇప్పటివరకు 46,583 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు కూడా ఇక్కడే నమోదయ్యాయి.

కోవిడ్‌పై చైనా, పాక్‌ ఉమ్మడి ప్రయోగాలు
కోవిడ్‌–19 టీకాపై ప్రయోగాల నిర్వహణకు సహకరించాలని పాకిస్తాన్‌ను చైనా కోరింది. ఇస్లామాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌) ద్వారా పాక్‌లో కోవిడ్‌ టీకా ప్రయోగాలు నిర్వహించాలని చైనా సంస్థ సైనోఫార్మ్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ నిర్ణయించింది. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకూ ఒక నిర్ణయం తీసుకోలేదని, ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తమకు మేలు జరుగుతుందని పాక్‌ అంటోంది.  
డబ్ల్యూహెచ్‌వోకు చైనా అదనపు గ్రాంట్‌
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు ఏటా ఇచ్చే రూ.152 కోట్లకు అదనంగా మరో రూ.228 కోట్లు ఇస్తున్నట్లు చైనా ప్రకటించింది. డబ్ల్యూహెచ్‌వోకు నిధులు నిలిపివేస్తున్నట్లు ఇటీవల అగ్రరాజ్యం అమెరికా ప్రకటించిన వెంటనే తాము ఎక్కువ నిధులు ఇస్తామని చైనా ప్రకటించిన విషయం తెలిసిందే.   

చైనాలో 2.32 లక్షల కేసులు: అధ్యయనం
చైనాలో కరోనా కేసులను ఆ దేశ ప్రభుత్వం తక్కువగా చెబుతోందని ప్రపంచ దేశాలన్నీ ఆరోపణలు గుప్పిస్తున్న వేళ, చైనాలో దాదాపు 2.32 లక్షల కేసులు నమోదై ఉంటాయని హాంకాంగ్‌ యూనివర్సిటీ నిపుణులు అంచనా వేశారు. ఫిబ్రవరి 20 నాటికి చైనా 55 వేల మందికి కరోనా సోకినట్లు చెప్పిందని, కానీ అప్పటికే దాదాపు 2.32 లక్షల మందికి కరోనా సోకి ఉంటుందని  లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌లో ఓ నివేదిక ప్రచురితమైంది. చైనా చెబుతున్న సంఖ్యకు, నిజమైన సంఖ్యకు వ్యత్యాసం ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. చెప్పిన సంఖ్య కంటే ఎక్కువ కేసులు నమోదై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు