బ్రిటన్‌ వీసా రుసుము రెట్టింపు!

14 Oct, 2018 03:26 IST|Sakshi

హెల్త్‌ సర్‌ చార్జీని పెంచుతుండటమే కారణం

డిసెంబరు నుంచి అమల్లోకి రానున్న కొత్త ఫీజు  

లండన్‌: యూరోపియన్‌ యూనియన్‌ బయటి దేశాల నుంచి బ్రిటన్‌కు వచ్చే వలసదారులపై విధించే హెల్త్‌ సర్‌చార్జీని ఆ దేశం డిసెంబరు నుంచి రెండింతలు చేయనుంది. దీంతో భారత్‌ సహా పలు దేశాల నుంచి బ్రిటన్‌కు వెళ్లే పౌరులు, విద్యార్థులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వీసా ఫీజు కింద మరింత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వలస వీసాదారులు ఏడాదికి 200 (దాదాపు రూ. 19,400) పౌండ్లు, విద్యార్థి వీసా కలిగినవారు ఏడాదికి 150 (దాదాపు రూ. 14,540) పౌండ్లు సర్‌చార్జీ కింద చెల్లిస్తున్నారు.

ఈ రుసుము వీసా ఫీజులో కలిపి ఉంటుంది. తాజాగా ఈ మొత్తాన్ని బ్రిటన్‌ రెండింతలు చేయాలని నిర్ణయించింది. దీంతో వలస వీసాదారులు 400 (దాదాపు రూ. 38,800) పౌండ్లు, విద్యార్థి వీసాదారులు 300 (దాదాపు రూ. 29,080) పౌండ్లను చెల్లించాల్సి ఉంటుంది. బ్రిటన్‌ జాతీయ ఆరోగ్య సేవల పథకం (ఎన్‌హెచ్‌ఎస్‌)కు నిధుల సమీకరణ కోసం హెల్త్‌ సర్‌చార్జీని  2015లో ప్రవేశపెట్టారు. తాజా పెంపు కారణంగా ఎన్‌హెచ్‌ఎస్‌కు ఏడాదికి 22 కోట్ల పౌండ్ల అదనపు నిధులు అందుతాయి.  బ్రిటన్‌ పౌరులతోపాటు 6 నెలలకు పైగా ఆ దేశంలో ఉండేందుకు వీసా మంజూరైన వారంతా ఈ రుసుము చెల్లించాలి. అయితే తాజా పెంపు నుంచి యూరోపియన్‌ యూనియన్‌ దేశాల పౌరులను మినహాయించారు.

వారూ చెల్లించడం సమంజసమే: మంత్రి
ఆరోగ్య పథకాన్ని వలసదారులకూ వర్తింపజేస్తున్నందున వారి నుంచి ఈ పథకానికి నిధులను సేకరించడం సమంజసమేనని బ్రిటన్‌ వలసల శాఖ మంత్రి కరోలిన్‌ నోక్స్‌ చెప్పారు. ‘అవసరమైనప్పుడు మా ఆరోగ్యసేవల పథకం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. దీర్ఘకాలం బ్రిటన్‌లో ఉండే వలసదారులు ఈ సేవలను వాడుకోవడాన్ని మేం స్వాగతిస్తాం. కానీ ఇది మా దేశానికి సంబంధించినది, అంతర్జాతీయ ఆరోగ్య పథకం కాదు. వలసదారులకూ మేం ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నందున వారు కూడా ఇందుకు కొంత మొత్తం చెల్లించడం సమంజసంగా ఉంటుంది.’ అని ఆమె వివరించారు. బ్రిటన్‌ పార్లమెంటు ఆమోదం తర్వాత డిసెంబరులో సర్‌చార్జీ పంపు అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన బిల్లును గురువారమే హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ప్రవేశపెట్టారు. బ్రిటన్‌లో ఆరు నెలల కన్నా ఎక్కువ కాలం ఉండాలనుకునే వలసదారులు.. స్వదేశానికి తిరిగొచ్చే వరకూ ఈ హెల్త్‌ సర్‌చార్జీని ప్రతి ఏటా చెల్లించాలి.

>
మరిన్ని వార్తలు