వ్యక్తి ధర్మం ఇలా..

23 Apr, 2017 00:43 IST|Sakshi
వ్యక్తి ధర్మం ఇలా..
చేతిలోకి మొబైల్‌ వచ్చిన తర్వాత ఎదుటివాడి ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం మానేశాం. పైగా దానిని సెల్‌ఫోన్‌తో చిత్రీకరించి, కుదిరితే సెల్ఫీలు దిగి ఫేస్‌బుక్కులోనో, వాట్సాప్‌లోనో పెడుతున్న రోజులివి. కానీ సిరియాలోని ఒక ఫొటోగ్రాఫర్‌ నైతిక ధర్మం కోసం కాసేపు తన వృత్తిధర్మాన్ని పక్కన పెట్టేశాడు. గత వారం సిరియాలోని పశ్చిమ అలెప్పొలో రెబల్స్‌కు పట్టున్న రషీదిన్‌ వద్ద ఓ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. గమ్యానికి చేరే మార్గంలో కాసేపు విశ్రాంతి కోసమని డ్రైవర్‌ బస్సు నిలపడంతో అందులో నుంచి దిగిన ఓ చిన్నారి చిప్స్‌ తింటూ నిలబడింది. అంతలోనే పెద్దపేలుడుతో ఆ బస్సులోని 126 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

వీరిలో దాదాపు 80 మంది చిన్నారులే. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్‌ అబ్ద్‌ అల్‌ఖదర్‌ హబక్‌కు చుట్టుపక్కల దృశ్యాలు చూసేసరికి అతని గుండె ఆగినంత పనైంది. వెంటనే తేరుకున్న అతను కాసేపు కెమెరాలను పక్కనపెట్టేయాలని సహచరులకు చెప్పి క్షతగాత్రులను కాపాడేందుకు రంగంలోకి దిగాడు. తొలుత ఒక చిన్నారి వద్దకు వెళ్లి చూశాడు. అప్పటికే ఆ బాలుడు చనిపోయి ఉన్నాడు. వెంటనే సమీపంలోనే గాయాలతో పడిఉన్న మరో బాలుడి వద్దకు వెళ్లాడు. అతను ఊపిరి తీసుకోవడానికి అవస్థ పడుతున్నట్లు గమనించిన హబక్, వెంటనే బాలుడిని చేతుల్లోకి తీసుకొని అంబులెన్స్‌ వద్దకు చేర్చాడు. తర్వాత మరో బాలుడిని కాపాడేందుకు వచ్చాడు.

ఈ క్రమంలో ఓ బాలుడి మృతదేహాన్ని చూసి చలించిపోయిన హబక్‌ మోకాళ్లపై కూలబడిపోయి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ దృశ్యాలన్నిటిని సమీపంలో ఉన్న వేర్వేరు ఫొటోగ్రాఫర్లు చిత్రీకరించారు. ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో కొన్ని వేలసార్లు షేర్‌ అయ్యాయి. నెటిజన్లు హబక్‌ మానవత్వానికి హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు.  
మరిన్ని వార్తలు