‘కోలుకున్నాం.. ఇప్పటికైనా నిజాలు చెప్పండి’

6 Apr, 2020 14:15 IST|Sakshi

కరోనా యుద్ధం: చైనాపై మండిపడ్డ న్యూయార్క్‌ అటార్నీ

వాషింగ్టన్‌: మానవాళి మనుగడకు పెనుముప్పుగా పరిణమించిన కరోనా వైరస్‌ గురించిన పచ్చి నిజాలను ఇప్పటికైనా చైనా ప్రపంచానికి చెప్పాలని ఇండో- అమెరికన్‌ లాయర్‌ రవి బాత్రా డిమాండ్‌ చేశారు. అప్పుడే శాస్త్రవేత్తలు, వైద్యులు ఈ మహమ్మారికి విరుగుడు కనిపెట్టగలరని అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చైనా ఈ ఒక్కపని చేస్తే ఎంతోమంది ప్రాణాలు నిలబడతాయన్నారు. గతేడాది చివర్లో చైనాలోని వుహాన్‌ నగరంలో బయటపడిన కరోనా వైరస్‌ ప్రస్తుతం ప్రపంచమంతా విస్తరిస్తూ మృత్యు ఘంటికలు మోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా కంటే ఎక్కువ కరోనా మరణాలు ఇటలీ, స్పెయిన్‌, అమెరికాల్లో సంభవిస్తున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యంలోని న్యూయార్క్‌ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఇప్పటికే అక్కడ కరోనాతో దాదాపు 4 వేల మంది మృతి చెందగా.. లక్షా ఇరవై వేల మందికి పైగా వైరస్‌ బారిన పడ్డారు. (చైనాకు పేరుప్రఖ్యాతులే ముఖ్యం: నిక్కీ హేలీ)

ఈ నేపథ్యంలో ప్రాణాంతక వైరస్‌ బారిన పడి కోలుకున్న న్యూయార్క్‌ లాయర్‌ రవి బాత్రా చైనా తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రపంచ ఆర్థిక రాజధానిగా పేరొందిన న్యూయార్క్‌ తీవ్ర సంక్షోభంలో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.‘‘మహమ్మారిని మానవత్వంతో మాత్రమే ఎదుర్కోగలమని భావిస్తున్నా. చైనా ఇప్పటికైనా నిజాలు చెప్పాలి. మా సూపర్‌ హీరో డాక్టర్‌ ఆంటోనీ ఫౌజీతో పాటు మిగతా దేశాల శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ను కనుగొనే పనిలో నిమగ్నమవుతారు. చావుతో మాట్లాడి వెనక్కి తిరిగి వచ్చినట్లుగా ఉంది. ఎగుమతులపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. ది వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌(ఆసియా దేశాలు, ఆఫ్రికా, యూరప్‌లతోధ్య కనెక్టివిటీ పెంచుకునేందుకు చైనా చేపట్టిన ప్రాజెక్టు) వంటి ప్రాజెక్టులు కేవలం కరోనాను వ్యాప్తి చేసేందుకే ఉపయోగపడతాయా’’అంటూ చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (కరోనా: ‘చైనా నమ్మదగ్గ భాగస్వామి కాదు’)

అదే విధంగా ‘‘ఇది అత్యాశకు పోవాల్సిన సమయం కాదు. కాస్త మానవత్వం చూపండి’’ అని విజ్ఞప్తి చేశారు. ఇక తనకు కరోనా ఎలా సో​కిందో తెలియదన్న రవి బాత్రా.. తన కారణంగా కుటుంబ సభ్యులు కూడా మహమ్మారి బారిన పడ్డారని తెలిపారు. 104 డిగ్రీల జ్వరంతో నరకం చూశానని.. అయితే ప్రస్తుతం తామంతా కోలుకున్నామని.. అయినప్పటికీ ఇంకా స్వీయ నిర్బంధంలోనే ఉన్నామని పేర్కొన్నారు. భోజనం చేసేటప్పుడు కూడా భౌతిక దూరం పాటిస్తున్నామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు