దేశమే లేని దీనులు..!

4 Jun, 2015 10:06 IST|Sakshi
దేశమే లేని దీనులు..!

భారత్-బంగ్లా సరిహద్దు ప్రాంతవాసుల దుస్థితి
‘నో మేన్స్ ల్యాండ్’లో 70 వేల మంది
పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం


జీరో పాయింట్ (బంగ్లా సరిహద్దు): బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడ్డప్పుడు అది భారత్‌తో కుదుర్చుకున్న ‘భూ సరిహద్దు ఒప్పందం’ (ఎల్‌బీఏ) పరిధిలోకి రాకపోవడంతో అక్కడున్న 260 గ్రామాలకు చెందిన 70 వేల మంది అనాథలుగా మారిపోయారు. ఈ పల్లెటూళ్లు ‘నో మేన్స్ ల్యాండ్’ (ఎవరికీ చెందని ప్రాంతం) పరిధిలోకి వెళ్లడంతో ఈ ప్రజలంతా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నారు. తరచూ నేరాల బారినపడుతున్నారు. సరిహద్దు మీదుగా అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ చెలామణి అడ్డుకోవడానికి గస్తీ నిర్వహించే భద్రతా దళాలకు వీరిపై ఎలాంటి వైఖరి అనుసరించాలో తెలియని వింత పరిస్థితి ఎదురవుతోంది. ఎల్‌బీఏ అమలైన తరువాత సరిహద్దులోని పలు వివాదాస్పద ప్రాంతాలను భారత్, బంగ్లాదేశ్ నియమాల ప్రకారం బదలాయించుకున్నాయి.

అంతర్జాతీయ సరిహద్దుకు అతి సమీపంలోని ఈ గ్రామాలపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. ‘ఈ గ్రామాలను అంతర్జాతీయ సరిహద్దు పరిధిలోకి తీసుకురావడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుందని మేం ప్రభుత్వానికి విన్నవించాం. అయినప్పటికీ ఉన్నతాధికారుల నుంచి స్పందన రాలేదు. ఈ గ్రామాలు తరచూ చట్టవ్యతిరేక కార్యకలాపాల బారినపడుతున్నాయి. కొన్నిసార్లు చొరబాటు యత్నాలు జరుగుతున్నాయి’ అని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) ఇన్‌స్పెక్టర్ జనరల్ సందీప్ సాలుంకే అన్నారు. పానితర్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో పక్క పక్కనే ఉన్న ఇళ్లలో ఒకటి భారత్, మరొకటి బంగ్లాదేశ్ పరిధిలోకి వస్తాయి. పది మీటర్ల వెడల్పున్న మార్గం రెండు దేశాలను విడదీస్తుందని బీఎస్‌ఎఫ్ వర్గాలు తెలిపాయి. ఫలితంగా చొరబాట్లుదారులు, నేరగాళ్లపై నిఘా ఉంచడం కష్టసాధ్యంగా మారిందని చెప్పాయి.

ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు పొడవు 4,096 కిలోమీటర్లు కాగా, దక్షిణ బెంగాల్ మార్గంలోని ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, నాదియా, ముర్షిదాబాద్, మాల్డా జిల్లాల పరిధిలోనే ఇలాంటివి 54 గ్రామాలు ఉన్నాయి. వీటిలోని 4,749 కుటుంబాల్లో దాదాపు 30 వేల మంది నివసిస్తున్నారు. ఈ గ్రామాలన్నింటిలోనూ నేరాల రేటు ఎక్కువగా ఉందని బీఎస్‌ఎఫ్ తెలిపింది. ఎవరికీ చెందని ప్రాంతాలపై నిఘా కోసం జవాన్లు వినూత్న వ్యూహాలను అమలు చేస్తున్నారు.

అక్కడి ప్రజలను సులువుగా గుర్తుపట్టడానికి ఫొటోలతో కూడిన రిజిస్టర్లు నిర్వహిస్తున్నారు. కొత్తగా ఎవరు వచ్చినా వివరాలు సేకరిస్తున్నారు. ఈ గ్రామాల్లో ఎక్కువ శాతం చిన్నవే కాబట్టి అన్నింటినీ అంతర్జాతీయ సరిహద్దు పరిధిలోకి తీసుకురావడం ఒక్కటే శాశ్వత పరిష్కారమని బీఎస్‌ఎఫ్ కమాండింగ్ అధికారి రత్నేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ గ్రామాల మహిళలు, చిన్నారుల సాయంతో దళారులు సిగరెట్లు, ఆహార పదార్థాలను భారత్‌లోకి అక్రమంగా రవాణా చేస్తున్నారని వెల్లడించారు.  భారత్ నుంచి కూడా బంగ్లాదేశ్‌లోకి ఆభరణాలు, దగ్గుమందు (మత్తుకోసం), వాహన విడిభాగాలు దొంగతనంగా రవాణా అవుతున్నాయి. ఇలాంటి ఘటనలపై వందలాది కేసులు నమోదైనట్టు కుమార్ చెప్పారు.

మరిన్ని వార్తలు