భారత్‌–పాక్‌ ఎన్‌ఎస్‌ఏల రహస్య భేటీ!

2 Jan, 2018 02:22 IST|Sakshi

డిసెంబర్‌ 27న థాయ్‌లాండ్‌లో చర్చలు

‘ద డాన్‌’ పత్రికలో కథనం

ధ్రువీకరించని భారత వర్గాలు

ఇస్లామాబాద్‌/న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌ ఉన్నతాధికారుల మధ్య థాయ్‌లాండ్‌లో రహస్య భేటీ జరిగిందన్న వార్త చర్చనీయాంశంగా మారింది. భారత్, పాక్‌ల జాతీయ భద్రతా సలహాదారుల(ఎన్‌ఎస్‌ఏ) మధ్య ఈ భేటీ సానుకూలంగా సాగిందని పాకిస్తాన్‌ జాతీయ భద్రతా విభాగం అధికారి ఒకరు వెల్లడించారు. ఆ అధికారి వెల్లడించిన వివరాల్ని ఉటంకిస్తూ ‘ద డాన్‌’ అనే పాక్‌ వార్తాపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. భారత్‌ ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ దోవల్, పాక్‌ ఎన్‌ఎస్‌ఏ నాజర్‌ ఖాన్‌లు డిసెంబర్‌ 27న రహస్యంగా కలుసుకున్నారని, భేటీలో దోవల్‌ సానుకూలంగా వ్యవహరించారని ఆ అధికారి చెప్పారు.

భారత్‌–పాక్‌ల మధ్య ద్వైపాక్షిక స్థాయి చర్చలు ప్రారంభించేందుకు ఈ సమావేశం కొంత మేర సాయపడవచ్చని పాక్‌ అధికారి పేర్కొన్నట్లు డాన్‌ తన కథనంలో పేర్కొంది. భేటీ గురించి భారత్‌ వైపు నుంచి మాత్రం ఎలాంటి అధికారిక, అనధికారిక స్పందన వెలువడలేదు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ మేరకే భేటీ జరిగినట్లు భావిస్తున్నారు. అయితే పాకిస్తాన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కుల్‌భూషణ్‌ జాధవ్‌ను ఆయన కుటుంబ సభ్యులు కలిసిన రెండు రోజుల అనంతరం ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. జాధవ్‌ కుటుంబ సభ్యుల్ని పాకిస్తాన్‌ అవమానించడంతో.. భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు ఇటీవల మరింత దిగజారిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌ జైల్లో ఉన్న జాధవ్‌ను చూసేందుకు వెళ్లిన ఆయన భార్య, తల్లితో బొట్టు, తాళి తీయించడంపై భారత్‌ తీవ్ర నిరసన తెలిపింది.  

అణు కేంద్రాల సమాచార మార్పిడి
ఇరుదేశాల్లోని అణు కేంద్రాలు, వాటికి సంబంధించిన అంశాలపై భారత్, పాక్‌లు దౌత్య మార్గాల ద్వారా సమాచారాన్ని మార్పిడి చేసుకున్నాయి. మూడు దశాబ్దాల క్రితం నాటి ద్వైపాక్షిక ఒప్పందం మేరకు ఢిల్లీ, ఇస్లామాబాద్‌ రాయబార కార్యాలయాలు సోమవారం అణు కేంద్రాల జాబితాల్ని ఇచ్చి పుచ్చుకున్నాయి. భారత్, పాకిస్తాన్‌ల్లోని అణు కేంద్రాలపై పరస్పర దాడుల నిషేధ ఒప్పందం డిసెంబర్‌ 31, 1988న జరగగా.. జనవరి 27, 1991 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ప్రతీ ఏడాది జనవరి 1న అణు కేంద్రాలు, సంబంధిత అంశాల సమాచారాన్ని మార్చుకుంటారు.  

మరిన్ని వార్తలు