ఇండోనేసియాలో భారీ భూకంపం

29 Sep, 2018 04:25 IST|Sakshi

పలు నివాసాలు, భవనాలు ధ్వంసం

జకార్తా: ఇండోనేసియాను భూకంపం వణికించింది. సులావేసి దీవిలో శుక్రవారం సంభవించిన ప్రకంపనలకు పలు ఇళ్లు కూలిపోగా, ఒకరు చనిపోయినట్లు తెలిసింది. రిక్టర్‌ స్కేలుపై 7.5 తీవ్రతగా నమోదైన ఈ భూకంప కేంద్రం సులావేసి పట్టణానికి సుమారు 56 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. భూకంపం అనంతరం సునామీ హెచ్చరికలు జారీచేసిన అధికారులు కొంతసేపటికి విరమించుకున్నారు. పాలూ అనే పట్టణంలో నీటి ఉధృతికి పలు భవనాలు కుప్పకూలాయి. సముద్ర అలలు సుమారు 1.5 మీటర్ల ఎత్తుకు ఎగిశాయని విపత్తు నిర్వహణ అధికారులు చెప్పారు.

సునామీ అలలకు భయపడి స్థానికులు ఎత్తయిన ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారు. భూకంప కేంద్రానికి చాలా దూరంలో ఉన్న ప్రజలు ప్రకంపనలు తమ నివాసాల్లోనూ వచ్చినట్లు తెలిపారు. భూకంపం ధాటికి పలు ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. కూలిపోయిన భవనాల శిథిలాలు, రాళ్లు రహదారులపైకి కొట్టుకొచ్చాయి. సునామీ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు వాహనాల్లో ఎగువ ప్రాంతాల వైపు బయల్దేరడంతో పాలూ పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. భూకంప ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లోకి సహాయక బృందాలు చేరుకుంటున్నారు. ప్రకంపనల ధాటికి ఎంతమంది చనిపోయారు? ఎందరు గాయాలపాలయ్యారు? అన్న సమాచారం తెలియరాలేదు.

మరిన్ని వార్తలు