‘ఆ దేవుడు నిన్నూ నన్నూ కలిపాడు.. విడదీసాడు కూడా’

25 Dec, 2018 17:28 IST|Sakshi
భార్యతో రిఫియన్‌ ఫజార్షా

తరచుగా ప్రకృతి విలయాల బారిన పడే ఇండోనేషియాలో సునామీ మృత్యు పాశమై అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి సముద్ర గర్భంలోని ఆనక్‌ క్రకటోవా అనే అగ్నిపర్వతం బద్ధలై.. సుమత్ర, జావా ద్వీపాల తీరాలపై సునామీగా విరుచుకుపడటంతో ఇప్పటివరకు దాదాపు 429 మంది మరణించారు. ఈ ప్రకృతి ప్రకోపానికి గురై నిరాశ్రయులైన వారు కొందరైతే... ప్రాణాలతో మిగిలి ఉన్నా తమ వారిని కోల్పోయి జీవచ్ఛవాలుగా మారామని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సునామీ ధాటికి తన కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు స్నేహితులను, తన భార్య ఙ్ఞాపకాలను తలచుకుంటూ ‘సెవెంటీన్‌’  అనే పాప్‌ గ్రూప్‌ లీడ్‌ సింగర్‌ రిఫియన్‌ ఫజార్షా సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

‘దిలాన్‌ సహారా... నువ్వు లేకుండా ఎలా బతకాలి. అత్యుత్తమ భార్యగా ఉండేందుకు నువ్వు ఎల్లవేళలా కృషిచేశావు. నిజానికి నువ్వు అలాగే ఉన్నావు కూడా. అందుకే ఇక దేవుడిని నేను అడగాల్సింది ఏమీ లేదనే నిర్ణయానికి వచ్చాను. కానీ ఈ రోజు అంతా తలకిందులైంది. ఇప్పుడు నీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించడం తప్ప నేనేం చేయగలను. మంచికో చెడుకో తెలియదు గానీ ఆ దేవుడు నిన్నూ నన్నూ కలిపాడు.. విడదీసాడు కూడా. అయితే నేను ఎంతగా ప్రేమిస్తున్నానో, నిన్నెంత మిస్సవుతున్నానో ఆ భగవంతునికే తెలుసు. నువ్వు నాతో పాటు ఉంటే ఈరోజు నీ పుట్టిన రోజు వేడుకలు జరిగేవి కదా. నా వల్లగానీ, నా భార్య వల్లగానీ ఎవరికైనా ఎప్పుడైనా ఇబ్బంది కలిగి ఉంటే అందుకు నేను క్షమాపణ కోరుతున్నాను’  అని తన భార్యను గుర్తు చేసుకుంటూ రిఫియన్‌ సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా శనివారం ‘సెవెంటీన్‌’ అనే పాప్‌ గ్రూప్‌ ప్రదర్శన ఇస్తుండగా, భారీ ఎత్తున్న నీటి అల వెనుకవైపు నుంచి వేదిక మీదకు వచ్చి పడింది. దీంతో వేదికపైనున్న కళాకారులు చెల్లాచెదురయ్యారు. ఈ క్రమంలో తన భర్త కన్సర్ట్‌ను చూసేందుకు అక్కడి వచ్చిన రిఫియన్‌ భార్య సహా... ఈ గ్రూపులోని ముగ్గురు సభ్యులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో రిఫియన్‌ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఇండోనేషియా రాజకీయవేత్త కూతురైన సహారా(25) టీవీ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. అదే విధంగా వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని ఆమె నిర్ణయించుకున్నారని.. ఈలోపే ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని స్థానిక మీడియా పేర్కొంది.

మరిన్ని వార్తలు