భారీ భూకంపం.. 400 మంది మృతి

30 Sep, 2018 04:31 IST|Sakshi
పలూ పట్టణంలో తీరంవెంబడి పడి ఉన్న స్థానికుల మృతదేహాలు

ఇండోనేసియాలో 400 మంది మృతి

పలూ పట్టణం నేలమట్టం

రిక్టర్‌ స్కేలుపై 7.5 తీవ్రత.. ధ్వంసమైన విద్యుత్, సమాచార వ్యవస్థ

ఇసుకలో కూరుకుపోయిన శవాలు

వందకుపైగా గల్లంతు

ఆరుబయటే క్షతగాత్రులకు వైద్యసేవలు

జకార్తా/పలూ: ఇండోనేసియాపై మరోసారి ప్రకృతి పగబట్టింది. 2004 నాటి సుమత్రా సునామీ దుర్ఘటనను, రెండు నెలల క్రితం నాటి భూకంపాన్ని మరిచిపోకముందే మరోసారి భూకంపం, సునామీ రూపంలో ప్రకృతి కన్నెర్రజేసింది. సులవేసి ద్వీపంలోని పలూ పట్టణంలో దేశ, విదేశీ పర్యాటకులు బీచ్‌ ఫెస్టివల్‌కు సిద్ధమవుతున్న తరుణంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా రిక్టర్‌ స్కేలుపై 7.5  తీవ్రతతో భూకంపం, ఆ వెంటనే 4–6 మీటర్ల ఎత్తు రాకాసి అలలతో సునామీ విరుచుకుపడటంతో 400 మంది మృతిచెందారు. వంద మందికిపైగా గల్లంతయ్యారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

ఆసుపత్రులు కూలిపోవడంతో ఆరుబయటే క్షతగాత్రులకు చికిత్సనందిస్తున్నారు. సముద్రతీరంలోని పలూ పట్టణం దాదాపుగా నేలమట్టమైంది. సహాయ కార్యక్రమాలను ప్రారంభించిన సైన్యం, అధికారులకు ఎటు చూసినా శవాల గుట్టలే కనబడుతున్నాయి. బీచ్‌లో ఇసుకలో కూరుకుపోయి సగం బయటకు కనబడుతున్న మృతదేహాలే దర్శనమిస్తున్నాయి. శనివారం రాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం 384 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భూ ఉపరితలానికి పదికిలోమీటర్ల లోతులో శుక్రవారం సాయంత్రం సమయంలో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. కాగా, సునామీ బారిన పడిన ఇండోనేసియాను  ఆదుకుంటామని ఐక్యరాజ్య సమితి ప్రసంగంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్పష్టం చేశారు.   

హృదయ విదారక దృశ్యాలు
భూకంపం తీవ్రతకు చాలాచోట్ల ఇళ్లు కూలిపోవడంతో శిథిలాల్లో చిక్కుకుని పలువురు చనిపోగా వేల మంది క్షతగాత్రులయ్యారు. ఆసుపత్రులూ కూలడంతో ఆసుపత్రుల ఆరుబయటే చికిత్సనందిస్తున్నారు. బీచ్‌లో కూరుకుపోయిన వారు కొందరైతే.. అలల ధాటికి  కొట్టుకొచ్చి బలమైన గాయాలతో చనిపోయిన వారు మరికొందరు. బురదలో కూరుకుపోయిన ఓ చిన్నారి మృతదేహాన్ని సహాయక సిబ్బంది బయటకు తీసి బంధువులకు అప్పజెబుతున్న దృశ్యాలు కంటతడిపెట్టించాయి.   

నిరాశ్రయులు లక్షల్లోనే..
భూకంపం తాకిడికి ఇళ్లన్నీ కూలి వేల మంది నిరాశ్రయులయ్యారు. భూమి కంపిస్తున్న సమయంలో స్థానికులు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్లు, రిసార్టులనుంచి బయటకు పరుగులు తీస్తున్న సమయంలోనే సునామీ విరుచుకుపడింది. సముద్ర తీరంలో ఉన్న ఓ మసీదు ఉవ్వెత్తున ఎగిసిపడిన అలల ధాటికి ధ్వంసమవగా.. సమీపంలోని ఇళ్లలోకి కార్లు, ఇతర వాహనాలు చొచ్చుకొచ్చాయి. ఓ ఎత్తైన భవనంపై ఏర్పాటుచేసిన సీసీటీవీలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. రోడ్లు, వీధి దీపాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో ఈ పట్టణమంతా శుక్ర, శనివారాల్లో రాత్రంతా చీకట్లోనే మగ్గింది. ‘అలలు అంతెత్తున ఎగసిపడుతుండటాన్ని చూసి పరిగెత్తాను. అందుకే ప్రాణాలు కాపాడుకోగలిగాను’ అని ఓ స్థానికుడు పేర్కొన్నారు.  

రంగంలోకి సైన్యం
ఈ ఏడాది జూలై, ఆగస్టులో లోంబోక్‌ ద్వీపంలో వచ్చిన దానికంటే ఈసారి వచ్చిన భూకంప తీవ్రతే ఎక్కువని అధికారులు తెలిపారు. కాగా, సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సైన్యాన్ని రంగంలోకి దించారు. విద్యుత్, సమాచార వ్యవస్థతోపాటు మౌలిక సదుపాయాలను పునరుద్ధరించే పనిలో సైన్యం ఉంది. శనివారం కూడా పలూలో భూమి పలుమార్లు స్వల్ప తీవ్రతతో కంపించింది. కాగా పలూకు సమీపంలోని దొన్‌గాలా ప్రాంతంపైనా సునామీ విరుచుకుపడినట్లు సమాచారం అందిందని.. అయితే అక్కడి పరిస్థితేంటనేది ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. ‘భూకంపం, సునామీల బాధితుల్లో చిన్నారులే ఎక్కువగా ఉండటం బాధ కలిగించింది. నీటి తీవ్రతకు కొట్టుకుపోయారని ప్రత్యక్షసాక్షులు, అధికారులు చెబుతున్నారు’ అని సేవ్‌ ద చిల్డ్రన్‌ ఎన్జీవో చీఫ్‌ టామ్‌ హోవెల్‌ పేర్కొన్నారు. పలూ పట్టణానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణాలు, గ్రామాల ప్రజలు కూడా వారి ప్రాంతాల్లో ఒకసారి భారీ కుదుపు వచ్చిందని పేర్కొన్నారంటే భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

సుమత్రాలో మొదలై..
ప్రపంచంలోని అద్భుతమైన పర్యాటక కేంద్రాల్లో ఒకటైన ఇండోనేసియాపై 2004 నుంచి ప్రకృతి పగబట్టింది. ఆ ఏడాది బాక్సింగ్‌ డే (డిసెంబర్‌ 26) సంబరాల్లో పర్యాటకులు ఉన్నపుడు 9.3 తీవ్రతతో వచ్చిన భూకంపం, ఆ తర్వాత 24 మీటర్ల ఎత్తులో వచ్చిన రాకాసి అలలు విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో ఇండోనేసియా వ్యాప్తంగా లక్షా 68వేల మంది చనిపోయారు. నాటి సునామీ భారత్‌సహా పలు దేశాలపై ప్రభావాన్ని చూపింది. 2005 మార్చిలో 8.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 900 మంది చనిపోయారు. 2006 మేలో జావా ద్వీపంలో వచ్చిన భూకంపం 6వేల మందిని బలిగొంది. 2009లో సుమత్రా ప్రధాన ఓడరేవైన పడాంగ్‌లో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపం 1,100 మందిని చంపేసింది. ఆ తర్వాత అడపా దడపా వచ్చిన భూకంపం, సునామీలు ఇండోనేసియాపై విరుచుకుపడుతూ వందల సంఖ్యలో ప్రాణాలు బలితీసుకుంటున్నాయి.  

రవాణా వ్యవస్థ ధ్వంసం
పలూ నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఓ భారీ బ్రిడ్జి ధ్వంసమైంది. ఈ నగరానికి మిగిలిన ప్రపంచంతో అనుసంధానం చేసే రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. కొండచరియలు పడి దార్లు మూసుకుపోయాయి. ప్రార్థనలకోసం తీరంలోని మసీదుకు వచ్చిన వారు మొదట భూమి కంపించగానే పరుగులు తీశారు. అంతలోనే వరుసగా భూమి కంపించడంతో చాలా మంది మసీదు శిథిలాల కింద చిక్కుకుపోయి మరణించినట్లు తెలుస్తోంది.


బురదలో కూరుకుపోయిన చిన్నారి మృతదేహాన్ని తరలిస్తున్న సహాయక సిబ్బంది


దాదాపు పూర్తిగా నేలమట్టమైన పలూ నగరంలోని ఆస్పత్రి ఆవరణలో చికిత్స పొందుతున్న భూకంప బాధితులు

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు