సముద్రంలో కూలిన విమానం

30 Oct, 2018 03:39 IST|Sakshi
విమానాశ్రయంలో రోదిస్తున్న ప్రయాణికుల కుటుంబీకులు, బంధువులు; సముద్రంలో బాధితుల కోసం సహాయక సిబ్బంది గాలింపు

విమానంలోని మొత్తం 189 మంది దుర్మరణం

ఇండోనేసియాలో దుర్ఘటన

పైలట్‌ భారతీయుడు

జకార్తా నుంచి బయల్దేరిన కాసేపటికే ప్రమాదం

మృతుల్లో ముగ్గురు చిన్నారులు

జకార్తా: ఇండోనేసియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని జకార్తా నుంచి సోమవారం ఉదయం 6.20 గంటలకు 189 మందితో పంగ్‌కల్‌ పినాంగ్‌ సిటీకి బయల్దేరిన ‘లయన్‌ ఎయిర్‌’ జెట్‌ విమానం జావా సముద్రంలో కుప్పకూలింది. బయల్దేరిన 13 నిమిషాలకే జకార్తాకు 32 మైళ్ల దూరంలో, కెరవాంగ్‌ సముద్ర తీరానికి దగ్గర్లో సముద్రంలో కూలిపోయింది. విమానంలో ప్రయాణిస్తున్న 182 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు.

ప్రమాదానికి గురైన ‘బోయింగ్‌ –737 మాక్స్‌’ జేటీ 610 విమానానికి భారతీయుడైన భవ్య సునేజా పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. ఫ్లైట్‌ డేటా ప్రకారం.. ఆకాశంలోకి వెళ్లాక వేగం పుంజుకుని 5 వేల అడుగుల పైకి చేరుకున్న కాసేపటికి, రాడార్‌ సంకేతాలను కోల్పోయి, కంట్రోల్‌ సెంటర్‌తో సంబంధాలు తెగిపోయి, వేగంగా నేలవైపు దూసుకువచ్చిన విమానం క్షణాల్లో సముద్రంలో కుప్పకూలింది. అంతకుముందు, కొన్ని క్షణాల ముందే, తిరిగి జకార్తాకు తిరిగిరావాల్సిందిగా ఆ విమాన పైలట్‌ను కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.

ప్రమాద సమాచారం తెలియగానే అధికారులు సహాయచర్యలు చేపట్టారు. తమకు లభించిన ఆనవాళ్ల మేరకు ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరూ బ్రతికే అవకాశం లేదని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారి బంబాంగ్‌ సుర్యొ అజి  తెలిపారు. విమానం నీళ్ల లోపలికి వేగంగా దూసుకువెళ్లడాన్ని పలువురు ప్రత్యక్ష సాక్షులు కూడా చూశారన్నారు. 40 మంది డైవర్లు సహా 150 మంది సహాయ చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. సముద్రంలో 30 నుంచి 40 మీటర్ల లోతులో విమాన శకలాలను గుర్తించారు. ఈ ఆగస్ట్‌లోనే ఈ విమానాన్ని సర్వీస్‌లోకి తీసుకున్నామని లయన్‌ ఎయిర్‌ సంస్థ తెలిపింది.

కొద్ది రోజుల క్రితం స్వల్ప మరమ్మతులకు గురైందని వెల్లడించింది. బాలిలో మరమ్మతులు జరిపి ఇటీవలే మళ్లీ జకార్తా తీసుకువచ్చామని, సోమవారం ఉదయం టేకాఫ్‌కు ముందు కూడా ఇంజనీర్లు స్వల్ప మరమ్మతులు చేశారని, అయితే, అది సాధారణంగా చేసే ప్రక్రియేనని లయన్‌ ఎయిర్‌ చీఫ్‌ ఎడ్వర్డ్‌ సైరాయిత్‌ వివరించారు. ఫ్లైట్‌ డేటా రికార్డర్, వాయిస్‌ రికార్డర్‌ లభిస్తే ప్రమాదానికి కచ్చితమైన కారణం తెలుస్తుందన్నారు. ఈ ప్రమాదంపై విమాన తయారీ సంస్థ బోయింగ్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రమాద ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

మరో గంటలో గమ్యస్థానానికి..
మరో గంటలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన పంగ్‌కల్‌ పినాంగ్‌ సిటీకి ఈ విమానం చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలియగానే జకార్తా విమానాశ్రయం చేరుకున్న ప్రయాణీకులు తమవారి ఆచూకీ కోసం తల్లడిల్లుతున్న హృదయ విదారక దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి. ‘నా కుమార్తె చనిపోయి ఉంటే కనీసం ఆమె ఖననమైనా సరిగ్గా జరగా లని కోరుకుంటున్నాను’ అని ఆ విమాన ప్రయాణఙ కురాలి తల్లి ఒకరు కన్నీళ్లతో చెప్పారు. ఇండోనేసియా నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ కమిటీ వివరాల మేరకు.. ప్రమాదానికి గురైన విమానంలో 178 మంది పెద్దలు, ఒక పాప, ఇద్దరు చిన్నారులు, ఇద్దరు పైలట్లు, ఆరుగురు విమాన సహాయక సిబ్బంది ఉన్నారు.

వారిలో దాదాపు 20 మంది ఇండోనేసియా ఆర్థిక శాఖ ఉద్యోగులున్నారు. తన స్నేహితులు చాలామంది అందులో ఉన్నారని ఆలస్యం కావడంతో విమానాన్ని అందుకోలేకపోయిన సోనీ సెతియావన్‌ చెప్పారు. 2015 ఆగస్ట్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా ఇండోనేసియాకే చెందిన త్రిగణ ఎయిర్‌లైన్స్‌ విమానం కూడా ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 54 మంది ప్రయాణికులు చనిపోయారు. ఏడాదిక్రితం ఎయిర్‌ ఏసియా విమాన ప్రమాదలో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. తక్కువ ధరలకే విమాన ప్రయాణం కల్పించే సంస్థగా పేరున్న లయన్‌ ఎయిర్‌కు చెందిన పలు విమానాలకు కూడా గతంలో ప్రమాదాలకు గురైన చరిత్ర ఉంది.

1999లో ప్రారంభం
లయన్‌ ఎయిర్‌ సంస్థను 1999లో ప్రారంభించారు. ప్రయాణికుల సంఖ్య పరంగా ఇండోనేసియాలో ఇది అతి పెద్ద విమానయాన సంస్థ. అంతర్జాతీయంగానే కాకుండా, దేశీయంగా వేలాది ద్వీపాలకు డజన్ల సంఖ్యలో విమానాలను నడుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా చూసినా, మలేసియాకు చెందిన ఎయిర్‌ఏషి యా తరువాత చవకైన ఎయిర్‌లైన్‌ ఇదే. ఈ సంస్థ నడుపుతున్న విమానాల్లో అత్యధికం బోయింగ్‌ 737 రకానివే. ఈ ఏడాది మొదట్లో 6.24 మిలియన్‌ డాలర్లతో 50 బోయింగ్‌ విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చింది.

భారత్‌లో సేఫే: డీజీసీఏ
భారత్‌లో విధుల్లో ఉన్న బోయింగ్‌ 737 మాక్స్‌ విమానాల్లో సాంకేతికపరమైన ఎలాంటి లోపాలు ఇప్పటివరకు తలెత్తలేదని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) ప్రకటించింది. భారత్‌లో స్పైస్‌ జెట్, జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థలు భారత్‌లో ఈ రకానికి చెందిన ఆరు విమానాలను నడుపుతున్నాయి.

ఎందుకు ఇక్కడే ప్రమాదాలు ఎక్కువ?
సుహార్తో నాయకత్వం కింద సైనిక పాలనలో ఉన్న ఇండోనేసియా 1997లో ప్రజాస్వామ్యానికి మళ్లింది. పర్యాటక రంగం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 2000లో విమానయాన రంగంలో ప్రైవేటు సంస్థలకు తలుపులు తెరిచింది. దాంతో అనేక సంస్థలు ఇక్కడ నుంచి సర్వీసులు ప్రారంభించాయి. ప్రస్తుతం దాదాపు 60 విమానయాన సంస్థలు ఇక్కడ పని చేస్తున్నాయి. సంస్థలు ఎక్కువ కావడంతో పోటీ పెరిగి ధరల యుద్ధానికి దారి తీసింది. టికెట్ల రేట్లు పోటీ పడి తగ్గిస్తున్న సంస్థలు నాణ్యత, భద్రత విషయంలో రాజీ పడుతున్నాయి. దీనిపై ప్రభుత్వ పర్యవేక్షణ కూడా కొరవడింది. ఫలితంగా ప్రమాదాలు పెరిగాయి. 2000 నుంచి తాజా ప్రమాదం వరకు లెక్కిస్తే ఇండోనేసియాలో మొత్తం 45 భారీ ప్రమాదాలు జరిగాయి.
1950–1999 మధ్య 35 ప్రమాదాలు జరిగాయి. ఒక్క 1997లో జరిగిన వివిధ ప్రమాదాల్లో మొత్తం 380 మంది చనిపోయారు. ఇండోనేసియా విమానయాన సంస్థల నిర్వహణలో భద్రతాపరమైన లోపాలున్నాయంటూ యూరోప్‌ దేశాలకు అక్కడి నుంచి విమాన సర్వీసులు నడపొద్దంటూ యూరోపియన్‌ యూనియన్‌ జూన్‌ 2016లో నిషేధం విధించింది. అమెరికా కూడా దశాబ్దం పాటు విధించిన నిషేధాన్ని 2016లో తొలగించింది.

పైలట్‌ భారతీయుడు
ప్రమాదానికి గురైన విమాన ప్రధాన పైలట్‌ భారతీయుడైన భవ్య సునేజా(31) అని, ఈ ప్రమాదంలో ఆయన కూడా దుర్మరణం చెందారని అక్కడి భారతీయ ఎంబసీ ప్రకటించింది. ఈ విమాన కో పైలట్‌గా హర్వీనో వ్యవహరించారు. సునేజాకు 6 వేల గంటలు, కో పైలట్‌ హర్వీనోకు 5 వేల గంటలకు పైగా విమానాలను నడిపిన అనుభవం ఉంది. సునేజా ఢిల్లీకి చెందిన వారు. మయూర్‌ విహార్‌లోని ఆల్కాన్‌ పబ్లిక్‌ స్కూల్లో చదువుకున్నారు. 2009లో బెల్‌ ఎయిర్‌ ఇంటర్నేషనల్‌ నుంచి పైలట్‌ లైసెన్స్‌ పొందారు. లయన్‌ ఎయిర్‌ సంస్థలో 2011 మార్చ్‌లో చేరారు. అంతకుముందు ఎమిరేట్స్‌లో ట్రైనీ పైలట్‌గా చేశారు. లయన్‌ ఎయిర్‌ సంస్థను విడిచి భారత్‌కు వచ్చి ఇక్కడి సంస్థలో పని చేయా లని సునేజా భావించా రని భారత్‌కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ వైస్‌ ప్రసిడెంట్‌ ఒకరు తెలిపారు. అందుకోసం తమను సంప్రదించాడని, అనుభవజ్ఞుడైన అలాంటి పైలట్‌ తమకూ అవసరమేనని భావించి, తాము కూడా సుముఖంగానే స్పందించామని చెప్పారు. అయితే, ఆయన ఢిల్లీ పోస్టింగ్‌ అడగడంతో, సర్వీస్‌లో చేరిన ఏడాది తరువాత ఢిల్లీ పోస్టింగ్‌ ఇస్తామని చెప్పామని వివరించారు.

పైలట్‌ భవ్య సునేజా

మరిన్ని వార్తలు