దెబ్బతిన్న అడవి పందితో ఒళ్లు గగుర్పొడిచే ఫైట్‌

18 Oct, 2017 12:54 IST|Sakshi

సికావావో, ఇండోనేషియా : సాధారణంగా గొడవపడుతుంటే సర్దుమణిగేలా చేయడం మానవ నైజం. కానీ, అదే మనుషులు తమ వెర్రి ఆనందం కోసం వింత వినోదాల పేరిట అటవీ జంతువులకు పెంపుడు జంతువులకు ఘర్షణ పెట్టి వాటి మధ్య రక్తం ఏరులై పారుతున్నా చూసి ఆనందిస్తుంటే దానికి ఏమని పేరుపెట్టాలి. ఇండోనేషియాలోని పశ్చిమ జావా దీవుల్లో ప్రతి ఏడాది ఇదే తంతు జరుగుతుందట. వన్యమృగ ప్రేమికులు, సామాజిక ఉద్యమకారులు వద్దని వారిస్తున్నా అలాగే ఒక సంప్రదాయంగా చేస్తుంటారట. తమ పొలాలను నాశనం చేసే అడవి పందులను బంధించి ఓ చిన్న నీటి మడుగులో పెట్టి చుట్టూ కంచె ఏర్పాటుచేస్తారు. వెర్రెత్తిన కోపంతో ఉన్న కుక్కలకు, అడవి పందులకు మధ్య పోరాటం పెడతారు.

ఇందుకోసం తమ కుక్కలకు ప్రత్యేకంగా తర్ఫీదునివ్వడంతోపాటు గెలిచే కుక్కలకు పెద్ద మొత్తంలో ప్రైజ్‌ మనీ కూడా ఇస్తుంటారు. ఇంకా చెప్పాలంటే అక్కడి వారు తమ కుక్కలను మన తెలుగు ప్రాంతాల్లో పందెం కోళ్లను మేపినట్లు మేపుతుంటారన్నమాట. అలా పెంచిన కుక్కలను రిజిస్ట్రేషన్‌ చేసుకొని వంతులవారిగా సీరియల్‌లో ఉండి అప్పటికే దెబ్బతిని ఉన్న అడవి పందులపైకి వదులుతారు. దాంతో వాటి మధ్య భీకర పోరు జరుగుతుంతూ చప్పట్లు విజిల్స్‌తో ఆనందిస్తుంటారు. ఈ పోరాటంలో పందులైనా చనిపోవచ్చు.. లేదా కుక్కలైనా చనిపోవచ్చు. ఏది చనిపోయినా వీరి కేరింతలు మాత్రం అస్సలు ఆగవు. దీనిపై ఎన్నిసార్లు సామాజిక ఉద్యమకారులు పోరాటం చేసిన ఫలితం లేకుండా పోయింది. 1960లో బోర్‌ ఫైటింగ్‌ పేరుతో బాంబూలు ఏర్పాటుచేసిన రాక్షస క్రీడ ఇప్పటికీ కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు