స్వదేశానికి భారతీయులు: మాల్దీవులు చేరుకున్న నౌక

7 May, 2020 13:26 IST|Sakshi

న్యూఢిల్లీ/మాలే: కరోనా వ్యాప్తి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో భారత  నావికాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ జలాశ్వ మాల్దీవులులోని మాలే పోర్టుకు చేరుకుంది. సముద్ర సేతు ఆపరేషన్‌ మొదటి దశలో భాగంగా ఐఎన్‌ఎస్‌ మగర్‌తో కలిసి 1000 మంది భారత పౌరులను స్వదేశానికి తరలించనుంది. ఈ విషయం గురించి నేవీ అధికార ప్రతినిధి కమాండర్‌ వివేక్‌ మధ్వాల్‌ మాట్లాడుతూ.. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూ తరలింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నౌకలో ప్రాథమిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని.. నౌక కొచ్చి(కేరళ)కి చేరుకున్న తర్వాత.. ప్రయాణీకుల ఆరోగ్య పరిస్థితిని సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు.(అందుకే ఆ గబ్బిలాలు మృత్యువాత పడ్డాయి!) 

ఇక రక్షణ, విదేశాంగ, హోం, ఆరోగ్య శాఖ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సమన్వయంతో ఈ ఆపరేషన్‌ ముందుకు సాగుతోందని వివేక్‌ మధ్వాల్‌ వెల్లడించారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో చిక్కుకుపోయిన భారత పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి ఐఎన్‌ఎస్‌ శార్దూల్‌ బయల్దేరిందని తెలిపారు. ఐఎన్‌ఎస్‌ జలాశ్వ, ఐఎన్‌ఎస్‌ మగర్‌, ఐఎన్‌ఎస్‌ శార్దూల్‌.. ఈ మూడు నౌకలు కొచ్చికి చేరుకున్న తర్వాత.. ప్రయాణికులను నిబంధనలు అనుసరించి ఆయా రాష్ట్రాలకు తరలిస్తారని వెల్లడించారు. కాగా యుద్ధనౌకలతో పాటు 64 విమానాల ద్వారా 12 దేశాల్లో చిక్కుకుపోయిన దాదాపు 15 వేల మంది భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నుంచి తరలింపు ప్రక్రియ మొదలైంది.(లాక్‌డౌన్‌: 14,800 మంది భారత్‌కు..)

>
మరిన్ని వార్తలు