సోషల్‌ మీడియాతో మానసిక అనారోగ్యం

19 May, 2017 22:38 IST|Sakshi
సోషల్‌ మీడియాతో మానసిక అనారోగ్యం

ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌తో దుష్ప్రభావాలు ఎక్కువ
రాయల్‌ సొసైటీ ఫర్‌ పబ్లిక్‌ హెల్త్‌ సర్వేలో వెల్లడి


లండన్‌:
సోషల్‌ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌తో మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని తాజా అధ్యయనంలో తేలింది. అయితే యూట్యూబ్‌ మాత్రం యువతపై అంతగా దుష్ప్రభావాన్ని చూపడం లేదని, పైగా సానుకూల ప్రభావాన్ని చూపుతోందని తాజా సర్వే స్పష్టం చేసింది. యువతపై సోషల్‌ మీడియా అనుకూల, ప్రతికూల ప్రభావాలపై లండన్‌లోని రాయల్‌ సొసైటీ ఫర్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఆర్‌ఎస్‌పీహెచ్‌) సర్వే నిర్వహించింది. 14 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసున్న 1,500 మంది యువతను ఎంపిక చేసి, రకరకాల ప్రశ్నలతో వారి నుంచి అభిప్రాయాలను సేకరించింది.

వారు చెప్పిన సమాధానాలను మానసిక నిపుణులతో కలిసి విశ్లేషించింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌ వినియోగిస్తున్న వారిలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు తేలింది. సిగరెట్, ఆల్క హాల్‌తో పోలిస్తే సోషల్‌ మీడియా అడిక్షన్‌ వల్ల కలిగే దుష్ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయని ఈ సర్వేకు నేతృత్వం వహించిన క్రేమర్‌ తెలిపారు. అందుకే సోషల్‌ మీడియాను ఎక్కువగా ఉపయోగించే యువత తమను తాము ఓసారి చెక్‌ చేసుకోవాల్సిన అవసరం ఉందని క్రేమర్‌ సూచించారు. 

మరిన్ని వార్తలు