ఇన్ స్టాగ్రామ్ లో లేటెస్ట్ హల్ చల్..

20 Jan, 2016 22:31 IST|Sakshi
వెడ్డింగ్ దుస్తుల్లో మెరిసిపోతోన్న కుక్కదంపతులు

ఎప్పుడు ఏ పుణ్యం చేసుకున్నాయో ఏమో ఆ శునక రాజాలు రాజభోగాలు అనుభవించాయి. సంపన్న వ్యక్తుల  వివాహాలకు ఏమాత్రం తీసిపోకుండా అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో లక్షలమంది ఫాలోయర్లతో పాపులర్ అయిపోయాయి. అంతేకాదు ఈ ప్రత్యేక వేడుక వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్ గా కూడ ప్రఖ్యాతి చెందింది. ఇంతకూ ఈ వివాహం వెనుక పెద్ద చరిత్రే ఉంది. అదేమిటో మీరూ చూడండి.

న్యూయార్క్  నగరంలోని ఒకప్పటి చారిత్రక ప్రాంత ఛల్సియా నైబర్ హుడ్ లోని.. హైలైన్ హోటల్ గతవారం రెండు శునక రాజాల కల్యాణ వైభోగానికి వేదికయ్యింది. వివాహానికి కస్టమ్ మేడ్ మార్చెసా డ్రెస్ ను ధరించి పోజిచ్చిన వధువు...   కావలియర్ కింగ్ ఛార్లెస్ స్పానియల్.. సుమారు మూడు లక్షల నలభై వేలమంది ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్స్ ను సంపాదించి వార్తల్లో నిలిచింది. అంతేకాదు లండన్ జ్యుయలర్స్ లో  సుమారు లక్షా ముఫ్ఫై వేల డాలర్లకు కొన్ననెక్లెస్... ఆ శునకం నిశ్చితార్థం ఉంగరం స్థానాన్ని ఆక్రమించింది. ఇదిలా ఉంటే వరుడు శునకం ఫిన్.. మాత్రం 16 వేలమంది ఫాలోయర్స్ తో ఇన్ స్టాగ్రామ్ లో నిరాడంబరంగా కనపడింది.  కుక్కలకోసం ప్రత్యేకంగా ఉండే ఖరీదైన దుకాణం రూపొందించిన తక్సేడో తో పాటు టోపీని ధరించి హుందాగా తయారయ్యింది.  

శునకాల వెడ్డింగ్ పార్టీకి... ఇరువైపుల యజమానులే కాక,  వారి వారి బంధుమిత్రులతోపాటు వారి పెంపుడు కుక్కలూ హాజరయ్యాయి. సుమారు రెండు వందల మంది హాజరైన ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే  ఈ హంగామా అంతా సామాజిక మీడియాలో స్థానం సంపాదించేందుకో, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకో కాదని నిర్వాహకులు అంటున్నారు. దీనంతటికీ వెనుక సేవా ధృక్పధం దాగుందని చెప్పారు. పెంపుడు జంతువుల సంరక్షణార్థం ఓ సేవా సంస్థకు సహాయం అందించేందుకే ఈ వేడుకను నిర్వహించినట్లు వారు చెప్పారు. ఒక్కో టికెట్ 150 డాలర్లకు అమ్మగా వచ్చిన విరాళాన్ని ఆ సంస్థకు అందించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు