రూ. 778 కోట్లకు అమ్ముడు పోయిన పెయింటింగ్‌!

15 May, 2019 20:00 IST|Sakshi

ప్రఖ్యాత ఫ్రెంచ్‌ చిత్రకారుడు క్లాడ్‌ మోనెట్‌ కుంచె నుంచి జాలువారిన ఓ కళాఖండం వేలంలో రికార్డు ధర పలికింది. మ్యూల్స్‌గా నామకరణం చేసిన ఈ పెయింటింగ్‌ మంగళవారం 110.7 మిలియన్‌ డాలర్ల(దాదాపు 778 కోట్ల రూపాయలు)కు అమ్ముడు పోయింది. తద్వారా అత్యధిక ధరక పలికిన ఇమ్‌ప్రెసినిస్ట్‌ పెయింటింగ్‌గా చరిత్ర సృష్టించింది. హేస్టాక్‌ కలెక‌్షన్‌లో భాగంగా ఓ సంస్థ ఈ ఏడాది నిర్వహించిన వేలంలో మ్యూల్స్‌ సహా కేవలం మూడు పెయింటింగులు మాత్రమే అమ్ముడుపోయాయి. కాగా ఫ్రాన్స్‌లో రూపుదిద్దుకున్న ఫ్రెంచ్‌ ఇమ్‌ప్రెనిజమ్‌(సంప్రదాయేతర పద్ధతిలో, విభిన్న కోణాల్లో పెయింటింగ్‌లు వేయడం)కు క్లాడ్‌ మోనెట్‌ను ఆద్యుడిగా పేర్కొంటారు. ఆయన పెటియింగ్‌లకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ ఉంది. అనేక మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన 86 ఏళ్ల వయస్సులో 1926లో మరణించారు.

ఇక తన పొరుగింటి వ్యక్తికి చెందిన కోతకొచ్చిన గోధుమ పంటను 25 రకాల పెయిటింగ్‌లలో మోనెట్‌ అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సిరీస్‌లో భాగమైన ఓ పెయింటింగ్‌కు మ్యూల్స్‌ అని పేరు పెట్టారు. మోనెట్‌ కుంచె నుంచి జాలువారిన అద్భుత కళాఖండాలను హేస్టాక్‌ కలెక‌్షన్‌ అని పిలుస్తారు. కాగా మంగళవారం నాటి వేలంలో భాగంగా కేవలం 8 నిమిషాల్లోనే మ్యూల్స్‌ అమ్ముడుపోయింది. అయితే మ్యూల్స్‌ను సొంతం చేసుకున్న వ్యక్తి వివరాలను నిర్వాహకులు వెల్లడించలేదు. ఇక ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ‘పెయింటింగ్‌కు ఇంత ధరా. నమ్మలేకపోతున్నాం రా బాబూ’  అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.     

మరిన్ని వార్తలు