ఇక ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ)టెక్నాలజీయే కింగ్‌...

2 Jun, 2018 00:32 IST|Sakshi

మరో నాలుగేళ్లలో అంటే 2022 సంవత్సరానికల్లా దేశీయ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ ) రంగంలో మూడింట ఒకవంతు అంటే దాదాపు ఏడు లక్షల ‘తక్కువ నైపుణ్యం’ కలిగిన ఉద్యోగాలు కనుమరుగు కానున్నాయి. భారత్‌తో పాటు అమెరికా, ఇంగ్లండ్‌లలో కూడా ఐటీ పరిశ్రమలో 7.5 శాతం వరకు ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుంది. ప్రపంచవ్యాప్త సాంకేతిక మార్పులకు అనుగుణంగా భారత్‌ ఐటీ రంగంలోనూ  ఎలక్ట్రానిక్‌ యంత్రాల వాడకం (ఆటోమేషన్‌) పెరగడం  వల్ల ఈ పరిస్థితి ఎదురుకానుంది.

ఈ యాంత్రీకరణలో భాగంగా రొబొటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ (ఆర్‌పీఏ), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)లను విస్తృతంగా ప్రవేశపెడుతున్నారు. మొత్తం ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం నిర్దే«శిత ఉద్యోగాలు పొందాలంటే మారుతున్న పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవాల్సిందేనని   అమెరికా పరిశోధనా సంస్ధ హెచ్‌ఎఫ్‌ఎస్‌ హెచ్చరిస్తోంది. అయితే ఈ యాంత్రీకరణతో ఐటీ రంగంలో ‘మధ్యంతర’, ‘ఉన్నతస్థాయి’ల్లో నైపుణ్యాలు కలిగిన వారికి లక్ష నుంచి రెండు లక్షల వరకు కొత్తగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. తమ ఉద్యోగులు భవిష్యత్‌ సవాళ్లను ఎదుర్కునేందుకు  వీలుగా పెద్ద ఐటీ కంపెనీలు కొత్త నైపుణ్యాల్లో శిక్షణను అందిస్తున్నాయి.  

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ)కు పెద్దపీట..!
ఐటీలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు వీలుగా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ)టెక్నాలజీకి యువత పెద్దపీట వేస్తున్నారు. 2017 అక్టోబర్‌–2018 మార్చి మధ్యకాలంలో ఐఓటీ సాంకేతికతకు సంబంధించిన కోర్సుల్లో 200 శాతం నమోదు పెరిగింది. రిమోట్‌  మానిటరింగ్‌కు వీలుగా యంత్రాలకు సెన్సర్లు అదనంగా జతచేయడం వంటివి ఈ టెక్నాలజీలో భాగంగా ఉన్నాయి. ఇంటర్నెట్‌కు లేదా ఏదైనా పరికరానికి మరే పరికరంతో అనుసంథానించడమే ఐఓటీ ప్రధాన ఉద్ధేశ్యం. దీనిలో భాగంగా స్మార్ట్‌ఫోన్లు మొదలుకుని హెడ్‌ఫోన్లు, ఫిట్‌నెట్‌ బాండ్లు ఇంకా టీవీ, కాఫీమేకర్, వాషింగ్‌ మెషిన్‌ వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు కనెక్ట్‌ అవుతాయి.  

జెట్‌ విమానం ఇంజన్‌తో, చమురు వెలికితీసే యంత్రాల రిగ్‌లతో సహా  వివిధ యంత్రాల భాగాలతోనూ ఈ పరికరాలు అనుసంథానించవచ్చు. గార్ట్‌నర్‌ అనే విశ్లేషణ సంస్థ అంచనా ప్రకారం 2020 సంవత్సరానికల్లా 2,600 కోట్లకు పైగా ఇలాంటి అనుసంథానించే పరికరాలు  (కనెక్టెడ్‌ డివైసెస్‌) ఉంటాయి. ఐఓటీ తర్వాత కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌), రోబొటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్, బ్లాక్‌చెయిన్, డేటా సైన్స్, బిగ్‌ డేటా ఫ్రేం వర్క్స్, క్లౌడ్‌ అండ్‌ డెవ్‌ ఓప్‌స్‌ వంటి కోర్సుల ద్వారా ఎక్కువ మంది తమ నైపుణ్యాలు పెంచుకుంటున్నారు.

ఐఓటీ ద్వారా ఈ రంగాల్లోకి...
ఐఓటీ ద్వారా నైపుణ్యాలు మెరుగుపరుచుకున్న వారికి హెల్త్‌కేర్, రిటైల్, ఉత్పత్తి, రవాణా, టెలీ కమ్యూనికేషన్ల రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్‌ పెరుగుతోంది.. ఐఓటీ సేవల ఔట్‌సోర్సింగ్‌లోనూ భారత టెకీలకు మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయి. గతేడాది ప్రపంచవ్యాప్తంగా  ఐఓటీ టెక్నాలజీ సర్వీసెస్‌ ఔట్‌సోర్సింగ్‌ మార్కెట్‌ విలువ 350 కోట్ల డాలర్ల  మేర ఉంది. అందులో దాదాపు సగం అంటే 152 కోట్ల డాలర్ల మార్కెట్‌ను భారత్‌ చేజిక్కించుకుంది.ఇందులో పశ్చిమ ఐరోపాకు 94 కోట్ల డాలర్లు, అమెరికాకు 81 కోట్ల డాలర్లు, తూర్పు ఐరోపాకు  15 కోట్ల డాలర్లు, మిగతా ప్రపంచదేశాలకు కేవలం 4.6 కోట్ల డాలర్ల మార్కెట్‌ లభించింది.
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

మరిన్ని వార్తలు