ఐఫోన్ 7 ఇయర్ ఫోన్లతో ప్రమాదమా?

10 Sep, 2016 18:08 IST|Sakshi
ఐఫోన్ 7 ఇయర్ ఫోన్లతో ప్రమాదమా?

కాలిఫోర్నియా: ఇప్పటికే ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టిన ప్రతిష్టాత్మకమైన ఐఫోన్ 7 సిరీస్ మొబైల్ ఫోన్లు అక్టోబర్ ఏడవ తేదీన భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్న విషయం తెల్సిందే. సంప్రదాయబద్ధమైన ఇయర్ ఫోన్లకు బదులుగా ‘ఎయిర్‌పాడ్స్’గా పిలిచే వైర్‌లెస్ ఇయర్ ఫోన్లను ఇందులో ప్రవేశపెట్టడం విప్లవాత్మకమార్పుగా ఐఫోన్ కంపెనీ అభివర్ణిస్తోంది. ఇది వైర్‌లెస్ యుగానికి నాంది పలికేందుకు తొలి ముందడుగుగా కంపెనీ సీఈవో టిమ్‌కుక్ స్వయంగా వ్యాఖ్యానించారు.
 
ఈ సిరీస్ ఐఫోన్లలో ఉపయోగిస్తున్న వైర్‌లెస్ ఎయిర్‌పాడ్స్ పూర్తిగా బ్లూటూత్ టెక్నాలజీపైనే పనిచేస్తాయి. ఎయిర్‌పాడ్స్‌లో బ్లూటూత్ కారణంగా విడుదలయ్యే రేడియేషన్ వల్ల ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. చెవికి సమీపంలో ఉండే మెదడు రక్తప్రసరణకు ఈ రేడియేషన్ అవరోధం కలిగిస్తుందని, దీనివల్ల మెదడుపై దుష్ప్రభావం ఉంటుందని ‘యుసి బెర్‌క్లీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’ ప్రొఫెసర్ డాక్టర్ జోయెల్ మోస్కోవిట్జ్ హెచ్చరించారు.

 అయితే ఎయిర్‌పాడ్స్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ ఫ్రీక్వెన్సీ (పౌనపుణ్యం) ఎంతుంటుందో ప్రస్తుతం వివరాలు అందుబాటులో లేవు. కానీ ఎఫ్‌సీసీ (ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్) నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడే రేడియేషన్ ఉంటుందని వీటిని తయారు చేసిన ఆపిల్ కంపెనీ ఇంజనీర్లు తెలియజేస్తున్నారు. మానవ ఆరోగ్యానికి హానికలిగించే రేడియేషన్, అయస్కాంత తరంగాలను నిరోధించేందుకు అనుగుణంగా ఎఫ్‌సీసీ మార్గదర్శకాలు లేవని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 200 మంది శాస్త్రవేత్తలు తేల్చారని డాక్టర్ జోయెల్ హెచ్చరించారు. ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌ను వాడడం అంటే ఓ మైక్రోవేవ్‌ను చెవులో పెట్టుకోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు.
 
మైక్రోవేవ్ నుంచి వెలువడే రేడియేషన్ కన్నా తమ ఎయిర్‌పాడ్స్ నుంచి తక్కువ స్థాయిలో రేడియేషన్ విడుదలవుతుందని ఆపిల్ ఇంజనీర్లు సమర్థిస్తున్నారు. బ్లూటూత్ స్పీకర్లను దూరంగా ఉండి విన్నా కొంత రేడియేషన్ ప్రభావానికి మనం గురవుతామని, అలాంటప్పుడు నేరుగా, అందులో మెదడుకు దగ్గరగా విడుదలయ్యే రేడియేషన్ ఎక్కువ ముప్పు ఉంటుందని ఆయన అన్నారు. కార్డుతో పనిచేసే ఇయర్‌ ఫోన్‌లే అన్నింటికన్నా ఉత్తమమన్నది తన అభిప్రాయమని ఆయన చెప్పారు.
 

>
మరిన్ని వార్తలు