మీరే కూల్చారు... సమాచారం ఇవ్వండి!

10 Jan, 2020 10:41 IST|Sakshi

ఇరాన్‌లో విమాన ప్రమాదంపై సందేహాలు

టెహ్రాన్‌: ఇరాన్‌- అమెరికాల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన ప్రమాదంపై పలువురు పాశ్చాత్య దేశాల అధినేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌ జనరల్‌ ఖాసిం సులేమాని మృతికి ప్రతీకారంగా ఇరాన్‌.. ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు ప్రయోగించిన క్రమంలో ఉక్రెయిన్‌ విమానం కుప్పకూలిందని అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగా కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో మాట్లాడుతూ.. బోయింగ్‌ ఎయిర్‌లైనర్‌ను ఇరాన్‌ కూల్చివేసిందని తమకు పలు ఇంటలెజిన్స్‌ నివేదికలు అందాయన్నారు. టెహ్రాన్‌ నుంచి బయల్దేరగానే విమానం కుప్పకూలడం వెనుక ఇరాన్‌ దాడుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇక బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సైతం జస్టిన్‌ ట్రూడో వ్యాఖ్యలను సమర్థించారు. ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కూల్చకపోయినా.. దాడుల్లో భాగంగానే ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.(దద్దరిల్లుతున్న ఇరాక్‌.. మరో రాకెట్‌ దాడి)

ఈ నేపథ్యంలో ఇరాన్‌ కీలక ప్రకటన చేసింది. విమానంలో సమస్య తలెత్తడంతో తిరిగి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించిందని వెల్లడించింది. ఈ క్రమంలో ప్రమాదం చోటుచేసుకుందని పేర్కొంది. అదే విధంగా ఈ ఘటనపై దర్యాప్తుతోపాటు, బ్లాక్‌బాక్స్‌లో సమాచారాన్ని విశ్లేషించేందుకు 45 మందితో కూడిన ఉక్రెయిన్‌ అధికారుల బృందం ఇరాన్‌కు చేరుకుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో తమపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న.. కెనడా వద్ద ఏదైనా సమాచారం ఉంటే దానిని వెంటనే తమతో పంచుకోవాలని విఙ్ఞప్తి చేసింది. (అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు.. ఈ విరోధం నేటిది కాదు

కాగా ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్‌ విమానం బుధవారం ఉదయం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 176 మంది(82 మంది ఇరానియన్లు, 11 ఉక్రెయిన్‌ పౌరులు, 10 మంది స్వీడిష్‌ పౌరులు, నలుగురు ఆఫ్గన్లు, ముగ్గురు జర్మన్లు, ముగ్గురు బ్రిటన్‌ పౌరులు) మరణించారు. ఇక వీరిలో 63 మంది కెనడియన్లు ఉండటంతో కెనడా ఈ ఘటనపై సీరియస్‌గా ఉంది. మరోవైపు.. తమ దేశ పౌరుల మృతికి, విమాన ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించేందుకు.. ఆయా దేశాల ప్రతినిధులను ఇరాన్‌ రావాల్సిందిగా కోరింది. (కూలిన విమానం... )


 

మరిన్ని వార్తలు