ఇరాన్‌ను కుదిపేస్తున్న పరువు హత్య

8 Jun, 2020 11:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

టెహ్రాన్‌: రెజా అష్రాఫీ (37) తన 14 ఏళ్ల కుమార్తెను వ్యవసాయ కొడవలితో దారుణంగా నరికి చంపే ముందు ఒక న్యాయవాదిని కలిశాడు. ‘నా కుమార్తె రోమినా, తన 29 ఏళ్ల ప్రియుడితో కలిసి పారిపోయి కుటుంబం పరువు తీసింది. తనను చంపేయాలనుకుంటున్నాను. నాకు ఎలాంటి శిక్ష పడుతుంది’ అని న్యాయవాదిని అడిగాడు. అందుకు సదరు లాయర్‌.. ‘నువ్వు అమ్మాయి సంరక్షకుడిగా ఉన్నావు. కనుక మరణశిక్ష పడదు. కానీ 3 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తావు’ అని న్యాయవాది అతనికి తెలిపాడు. ఈ సంభాషణ జరిగిన మూడు వారాల తర్వాత అష్రాఫీ.. గదిలో నిద్రిస్తున్న తన కుమార్తె రోమినాను దారుణంగా తల నరికి చంపేశాడు. గత నెలలో ఉత్తర ఇరాన్ పచ్చని కొండలలోని ఒక చిన్న గ్రామంలో చోటు చేసుకున్న ఈ పరువు హత్య దేశాన్ని కదిలించింది. మహిళలు, పిల్లల హక్కుల గురించే కాక సామాజిక, మత, చట్టపరమైన వైఫల్యాలపై దేశవ్యాప్తంగా చర్చను లేవనెత్తింది. 

రోమినా ఓ యువకుడిని ప్రేమిస్తుందని తెలిసి తండ్రి ఆమెను హెచ్చరించాడు. మాట వినకపోతే చంపుతానని చాలాసార్లు బెదిరించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని రోమినా తల్లి తెలిపింది. రోమినా ప్రియుడు మాట్లాడుతూ.. ‘12 ఏళ్ల వయసు నుంచి నాకు ఆమె తెలుసు. తనను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ రోమినా తండ్రి అందుకు అంగీకరించలేదు. నేను అతడికి నచ్చలేదు. దాంతో అతడు తనను ఇంట్లో బంధించాడు.. ఫోన్‌ లాగేసుకున్నాడు. బెదిరించాడు. ఓ రోజు ఏకంగా ఇంటికి ఎలుకల మందు, తాడు తీసుకొచ్చి రోమినాను ఆత్మహత్య చేసుకోమని చెప్పాడు. తండ్రి చర్యలతో భయపడిన రోమినా ఓ లెటర్‌ రాసి పెట్టి నా దగ్గరకు వచ్చింది. ‘నాన్న మీరు నన్ను చంపాలనుకుంటున్నారు. అందుకే ఇంట్లో నుంచి వెళ్లి పోతున్నాను. నా గురించి మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే.. చనిపోయానని చెప్పండి’ అని లెటర్‌లో రాసింది. తర్వాత ఆమె నా దగ్గరకు వచ్చింది’ అని తెలిపాడు. 

అతడు మాట్లాడుతూ.. ‘విషయం తెలుసుకున్న అష్రాఫీ నా మీద కిడ్నాప్‌ కేసు పెట్టాడు. కానీ రోమినా తన ఇష్టపూర్వకంగా నా దగ్గరకు వచ్చిందని తెలుసుకున్న పోలీసులు కేసు కొట్టివేశారు. కానీ రోమినాను తండ్రితో వెళ్లమని చెప్పారు. అందుకు తను ఒప్పుకోలేదు. ఇంటికి వెళ్తే తండ్రి తనను చంపుతాడని ఆమె భయపడింది. కానీ పోలీసులు అలా ఏం జరగదని హామీ ఇవ్వడంతో ఇంటికి వెళ్లింది. మరుసటి రోజు రాత్రే తండ్రి చేతిలో దారుణ హత్యకు గురయ్యింది’ అంటూ ఆవేదన వ్యక్యం చేశాడు. రోమినా తండ్రికి కఠిన శిక్ష పడాలని కోరుకున్నాడు. ప్రస్తుతం రోమినా తండ్రి జైలులో ఉన్నాడు.

హత్య చేస్తే మరణశిక్ష కానీ..
ఇరాన్‌లో హత్య చేసిన వ్యక్తికి ‘కంటికి కన్ను’ అనే షరియా ఆదేశం ప్రకారం మరణశిక్ష విధిస్తారు. కానీ ఇస్లామిక్ చట్టం ఆధారంగా శిక్షాస్మృతి, తన బిడ్డను చంపినందుకు ఒక సంరక్షకుడికి మరణశిక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇరాన్‌లో పిల్లల తల్లితండ్రులని చట్టపరమైన సంరక్షకులుగా పేర్కొంటారు. అయితే తన బిడ్డను చంపిన తల్లి మరణశిక్షను ఎదుర్కొంటుంది. రోమినా పరువు హత్య పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ సుప్రీం నాయకుడు, అయతోల్లా అలీ ఖమేనీ, రోమినా హత్యను తీవ్రంగా ఖండించారు. స్త్రీలను వేధింపులకు గురిచేసే ఏ వ్యక్తికైనా ‘కఠినమైన శిక్ష’ విధించాలని పిలుపునిచ్చారు. 

మరణశిక్ష ఇస్లామిక్‌ చట్టానికి వ్యతిరేకం
కానీ సంప్రదాయవాద మతాధికారి, చట్టసభ సభ్యుడు మౌసా గజన్ఫరాబాది స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇరాన్‌లో మహిళలపై హింసకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలు సరిపోతాయి. మేము రోమినా తండ్రిని ఉరితీయలేము. ఎందుకంటే ఇది ఇస్లామిక్ చట్టానికి విరుద్ధం’ అన్నారు. ‘తండ్రి కుమార్తెను చంపడం.. అతడికి మరణశిక్ష నుంచి మినహాయింపు లభించడం ఏంటి’ అని ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త, మాజీ చట్టసభ సభ్యుడు ఫేజె హషేమి ప్రశ్నించారు. ప్రజలు కూడా ఈ సంఘటన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాన్ని మార్చాలని పెద్ద ఎత్తును డిమాండ్‌ చేస్తున్నారు. ఇరాన్ సాయుధ దళాలతో అనుబంధంగా ఉన్న ఒక పరిశోధనా కేంద్రం విడుదల చేసిన నివేదికలో 2019 ఇరాన్‌లో జరిగిన మొత్తం హత్య కేసులలో దాదాపు 30 శాతం పరువు హత్యలుగా గుర్తించింది.

రక్షణ లేని రోమినాలు ఎందరో
రోమినా పరువు హత్య ఉదంతంతో పలువురు మహిళలు తాము ఎదుర్కొంటున్న మానసిక, శారీరక హింస గురించి వెల్లడించారు. టెహ్రాన్‌కు చెందిన 49 ఏళ్ల ఇద్దర బిడ్డల తల్లి మినూ మాట్లాడుతూ.. ‘నా భర్త 17 ఏళ్ల నా కుమార్తెను వీధిలో ఒక మగ స్నేహితుడితో చూసి కొట్టాడు’ అని చెప్పింది. హనీహ్ రాజాబీ, పీహెచ్.డీ తత్వశాస్త్రం విద్యార్ధిని ‘ఐస్‌ క్రీం తినడానికి వెళ్లాను. కాలేజీ బస్సు వెళ్లి పోయింది. దాంతో వేరే బస్సులో ఇంటికి వచ్చాను. విషయం తెలిసి నా తండ్రి నన్ను బెల్టుతో కొట్టాడు. ఒక వారం పాటు కాలేజీకి పంపలేదు’ అని ట్వీట్ చేశారు. మరికొందరు అత్యాచారం, శారీరక, మానసిక వేధింపుల కథలను పంచుకున్నారు. తమ భద్రత కోసం ఇంటి నుంచి పారిపోయమన్నారు. ‘ఈ దేశంలో రక్షణ లేని వేలాది మంది రోమినాలు ఉన్నారు’ అని కిమియా అబోద్లాజాదే ట్వీట్ చేశారు.

ఇతర మధ్యప్రాచ్య దేశాల కంటే ఇరాన్ మహిళల పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంటుందని చెప్పవచ్చు. ఇరాన్ మహిళలు న్యాయవాదులు, వైద్యులు, పైలట్లు, ఫిల్మ్ డైరెక్టర్లు, ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వారికి యూనివర్సిటీల్లో 60 శాతం సీట్లు, ఉద్యోగాల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇరాన్‌ మహిళలు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. పార్లమెంట్, క్యాబినెట్‌కు ఎన్నుకోబడతారు. వీటితో పాటు మహిళలకు కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి. స్త్రీలు తమ జుట్టు, చేతులు, నడుము భాగాలను కప్పి ఉంచాలి. దేశం విడిచి వెళ్లలన్నా, విడాకులు అడగాలన్నా.. విదేశాల్లో పని చేయాలన్నా వారికి మగ బంధువు అనుమతి తప్పనిసరి.


 

మరిన్ని వార్తలు