బుడతడి స్నేహానికి నెటిజన్లు ఫిదా..

18 Nov, 2017 10:35 IST|Sakshi

టెహ్రాన్ : ఇటీవల ఇరాక్-ఇరాన్ సరిహద్దుల్లో భూకంపం విధ్వంసం సృష్టించింన విషయం తెలిసిందే. భూకంప దాటికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. అనంతరం సహాయక చర్యల్లో భాగంగా ఆహార పంపిణీ సందర్భాంగా చోటు చేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. పిలిచినా, పిలవకపోయినా కష్టసుఖాల్లో నీడల్లే తోడుండే వాడే నిజమైన మిత్రుడు అనడానికి ఇరాన్‌లోని ఓ బుడతడు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచాడు.

భూకంప దాటికి చాలామంది ఇళ్లు నేలమట్టమయ్యాయి. కొందరు కుటుంబ సభ్యులను, మిత్రులను కూడా కోల్పోయి నిలువనీడ లేకుండా పోయారు. అయితే భూకంపదాటికి  నిరాశ్రయిరాలైన తన స్నేహితురాలు ఆకలితో అలమటించకుండా నేనున్నానంటూ ఆమెకి అండగా నిలిచాడు ఓ బుడతడు. ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు, భూకంపబాధితులకు ఆహారాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఆకలితో ఉన్న తన స్నేహితురాలిని బుడతడు చేయిపట్టుకొని ధైర్యంగా ఆహారాన్ని పంపిణీ చేస్తున్న వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆమె వీపు తడుతూ ఈమెకి ఆహారం ఇంకా ఇవ్వలేదు అని చెప్పాడు. బుడతడి ధైర్యానికి నివ్వెర పోయిన ఆ వ్యక్తి వ్యానులోంచి ఆహారాన్ని తీసి చిన్నారికి ఇచ్చాడు. అనంతరం ఆ బుడతడిని కూడా ఆహారం అందిందా అని అడగ్గా.. లేదనడంతో అతనికి కూడా ఆహారాన్ని అందించి అక్కడున్న వ్యక్తి ప్రేమగా బుడతడి చెంపలను నిమిరాడు. బుడతడు తన స్నేహితురాలిని ఎంతో ఆప్యాయంగా తీసుకెళుతుండగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. చిన్నారుల స్నేహం అలానే కలకాలం ఉండాలి, భూకంపబాధితులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

కాగా, భూకంప మృతుల సంఖ్య 530కి చేరుకుంది. గత ఆదివారం రాత్రి సంభవించిన ఈ భూకంపంలో 8,100 మందికి పైగా గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో ఇరాన్ పశ్చిమ ప్రాంతంలోని కెర్మన్‌షా ప్రావిన్సు, ఇరాక్ ఉత్తర భాగంలోని కుర్దిష్ ప్రావిన్సుల్లోని పలు ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంప తీవ్రతకు ఇరాన్-ఇరాక్ సరిహద్దుల్లో ఉన్న జహాబ్ పట్టణం పూర్తిగా దెబ్బతింది. ఇరాన్‌లో 14 ప్రావిన్సులపై భూకంప ప్రభావం పడింది. ఇరాక్‌లోని హలబ్జ పట్టణానికి 31 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలం నుంచి 23.2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని భూ పరిశీలన సంస్థ తెలిపింది. భూకంప ప్రభావంతో చాలా ప్రాంతాలు ఇంకా అంధకారంలోనే ఉండిపోయాయి.

భూకంప దాటికి చాలా మంది చిన్నారులు నిరాశ్రయిలుగా మిగిలిపోయారు

మరిన్ని వార్తలు