అమెరికాను ధిక్కరించి క్షిపణి పరీక్ష

24 Sep, 2017 02:41 IST|Sakshi

ఇరాన్‌ మిస్సైల్‌ పరీక్ష సక్సెస్‌

టెహ్రాన్‌: అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా ఇరాన్‌ శనివారం మధ్య శ్రేణి క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఖోరంషాహ్ర్‌ అనే ఈ క్షిపణిని శుక్రవారమే ఇరాన్‌ సైనిక కవాతులో ప్రదర్శించింది. 2,000 కిలో మీటర్ల లోపు దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదనీ, బహుళ సంఖ్యలో వార్‌హెడ్లను మోసుకెళ్లగలదని ఇరాన్‌ అధికారిక మీడియా వెల్లడించింది.  ఇరాన్‌ శత్రుదేశాలైన ఇరాక్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, గల్ఫ్‌ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయి.

2015లో ఇరాన్‌కు, ఇతర ప్రధాన దేశాలకు అణు పరీక్షల నిషేధంపై ఒప్పందం కుదిరింది. అమెరికాతోపాటు బ్రిటన్, చైనా, రష్యా, యూరోపియన్‌ కూటమి ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 2025 వరకు అమలులో ఉండే ఈ ఒప్పందం ప్రకారం అణ్వస్త్ర పరీక్షలు జరపకుండా ఇరాన్‌పై ఆంక్షలున్నాయి. క్షిపణి పరీక్షలను జరిపితే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని అమెరికా హెచ్చరిస్తున్నా ఇరాన్‌ దుందుడుకుగా వ్యవహరిస్తోంది. మరోవైపు ఐరాస సర్వసభ్య సమావేశంలోనూ ట్రంప్‌ ఇటీవల మాట్లాడుతూ పశ్చిమాసియా దేశాల్లో ఇరాన్‌ అశాంతిని రగిలిస్తోందనీ, అది రక్తపాతం, కల్లోలం, హింసను ఎగుమతి చేసే ధూర్త దేశం అని నిప్పులు చెరగడం తెలిసిందే.

మరిన్ని వార్తలు