ట్రంప్‌ తలపై రూ.575 కోట్లు

7 Jan, 2020 04:33 IST|Sakshi

ట్రంప్‌ను చంపిన వారికి భారీ నజరానా ప్రకటించిన ఇరాన్‌

అణు ఒప్పందం నుంచి వైదొలగాలని నిర్ణయం

టెహ్రాన్‌/వాషింగ్టన్‌: ఇరాన్‌ జనరల్‌ సులేమానీ మృతికి కారణమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తలకు ఇరాన్‌ వెలకట్టింది. ఆయన్ను చంపిన వారికి దాదాపు రూ.575 కోట్ల భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది. మరోవైపు, అమెరికా డ్రోన్‌ దాడిలో చనిపోయిన జనరల్‌ సులేమానీ(62) మృతదేహం సోమవారం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌కు చేరుకుంది. సులేమానీకి నివాళులర్పించేందుకు నలుపు రంగు దుస్తులు ధరించిన జనం ఇసుకేస్తే రాలనంతమంది తరలివచ్చారు. 

అనంతరం ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా  అలీ ఖమేనీ నేతృత్వంలో ప్రార్థనలు జరిగాయి. జనరల్‌ సులేమానీ, తదితరులకు చెందిన శవపేటికల వద్ద ప్రార్థనలు చేసే సమయంలో ఖమేనీ కన్నీటి పర్యంతమయ్యారు. అధ్యక్షుడు రౌహానీ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను చంపిన వారికి భారీ బహుమానం అందజేస్తామంటూ ఈ సందర్భంగా ఇరాన్‌  ప్రభుత్వ మీడియా తెలిపింది.ఇరాన్‌లోని 8 కోట్ల మంది పౌరుల నుంచి ఒక్కో అమెరికా డాలర్‌(సుమారు రూ.71.79) చొప్పున రూ.575 కోట్లు చందాగా వసూలు చేసి ట్రంప్‌ను చంపిన వారికి అందజేస్తామన్నట్లు మిర్రర్‌ వెబ్‌సైట్‌ తెలిపింది.

సులేమానీకి నివాళులర్పిస్తూ ఖమేనీ కంటతడి

అలాగైతే.. ఇరాక్‌పైనా ఆంక్షలు
అమెరికా బలగాలు తమ దేశం నుంచి వెంటనే వెళ్లిపోవాలంటూ ఇరాక్‌ పార్లమెంట్‌ తీర్మానించడంపై అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు.‘ఇరాక్‌ కోసం మేం చాలా డబ్బు వెచ్చించాం. మా బలగాలను ఉంచిన వైమానిక స్థావరం ఏర్పాటుకు కోట్లాది డాలర్ల ఖర్చయింది. అదంతా తిరిగి చెల్లించకుండా ఖాళీ చేసేదిలేదు. ఒక వేళ మాపై ఒత్తిడి చేసినా, తేడాగా వ్యవహరించినా ఎన్నడూ ఎదుర్కోనంతటి తీవ్ర ఆంక్షలను ఇరాక్‌ చవిచూడాల్సి ఉంటుంది’అని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు, అమెరికా, ఇరాన్‌లు చేస్తున్న తీవ్ర ప్రకటనల నేపథ్యంలో జర్మనీ చాన్సెలర్‌ మెర్కెల్, ఫ్రాన్సు అధ్యక్షుడు మేక్రాన్, బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌ ఒక ఉమ్మడి ప్రకటన చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అన్ని పక్షాల వారు బాధ్యతగా వ్యవహరించాలని ప్రకటనలో పేర్కొన్నారు.  

అణు ఇంధన శుద్ధి పరిమితులపై..
తాజా పరిణామాల నేపథ్యంలో 2015 అణు ఒప్పందంలోని ఇంధన శుద్ధిపై పరిమితులను ఇకపై పట్టించుకోబోమని ఇరాన్‌ ప్రకటించింది. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పెంచుకుంటామని, ఇందుకోసం పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను విస్తృతం చేస్తామని తెలిపింది. అణ్వాయుధాలను తయారు చేయబోమన్న మునుపటి హామీకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. కాగా, 2018లో అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్న అమెరికా ప్రకటించిన తర్వాత ఇరాన్‌ చేసిన తాజా ప్రకటనతో ఈ ఒప్పందం అమలు ప్రమాదం పడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ విరోధం ఇప్పటిది కాదు
► 1979: అమెరికా అండతో కొనసాగుతున్న ఇరాన్‌ పాలకుడు మొహమ్మద్‌ రెజా పహ్లావీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. దీంతో ఆయన అమెరికాకు పారిపోయారు. ఆందోళనకారులు టెహ్రాన్‌లోని అమెరికా ఎంబసీని 1979 నవంబర్‌ నుంచి 1981 జనవరి వరకు ముట్టడించారు.

► 1988: గల్ఫ్‌ ప్రాంతంలో ఇరాన్‌ విమానాన్ని అమెరికా బలగాలు కూల్చివేశాయి. ఈ ఘటనలో 290 మంది ప్రాణాలు కోల్పోయారు.
 

► 2000: ఇరాన్‌ అణ్వాయుధాలను తయారు చేస్తోందనే ఆరోపణలపై అమెరికా ఆంక్షలు.  

► 2002: ఇరాక్, ఉత్తరకొరియాతోపాటు ఇరాన్‌ను అమెరికా దుష్ట్రతయంలో చేర్చింది.  

► 2013–16: ఒబామా హయాంలో ఇరాన్‌తో సంబంధాలు గాడినపడ్డాయి.  

► 2015: అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, రష్యా, చైనా, జర్మనీలు ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

► 2019: అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.

మరిన్ని వార్తలు