80 మంది చచ్చారు.. ఇంకా 100 లక్ష్యాలు!

8 Jan, 2020 12:49 IST|Sakshi

అమెరికాకు ఇరాన్‌ హెచ్చరికలు

టెహ్రాన్‌: ఇరాన్‌ జరిపిన క్షిపణి దాడుల్లో 80 మంది ‘అమెరికా ఉగ్రవాదులు’ మరణించారని ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఇరాక్‌లో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్‌ ప్రయోగించిన 15 క్షిపణులు లక్ష్యాల్ని ఛేదించడంలో సఫలమయ్యాయని తెలిపింది. ఈ దాడిలో అమెరికా హెలికాప్టర్లు, సైన్యం సామాగ్రి పూర్తిగా ధ్వంసమైనట్లు పేర్కొంది. అదే విధంగా ఈ దాడులకు ప్రతిగా అమెరికా ఎదురుదాడికి దిగితే సమాధానం చెప్పడానికి ఇరాన్‌ సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. అమెరికా చర్యలను తిప్పికొట్టేందుకు ఇరాక్‌లో మరో 100 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్‌ రెవల్యూషన్‌ గార్డ్స్‌ వర్గాలు తెలిపాయని పేర్కొంది.(ఇరాన్‌ ప్రతీకార దాడి; రేపే ప్రకటన: ట్రంప్‌)

కాగా  అమెరికా బలగాలకు ఆతిథ్యం ఇస్తున్న ఇరాకీ స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ బుధవారం దాడులకు దిగింది. అల్‌- అసద్‌, ఇర్బిల్‌లో ఉన్న వైమానిక స్థావరాలపై బాలిస్టిక్‌ క్షిపణులతో విరుచుకుపడింది. తమ జనరల్‌ సులేమానీని డ్రోన్‌ దాడిలో చంపిన అమెరికా సైనికులు.. ఈమేరకు ఆదేశాలు జారీ చేసిన రక్షణశాఖ (పెంటగాన్‌), అనుబంధ సంస్థల అధికారులు, ఏజెంట్లు, కమాండర్లందరినీ ఉగ్రవాదులుగా పరిగణిస్తామంటూ ఇరాన్‌ పార్లమెంట్‌ తీర్మానించిన విషయం తెలిసిందే.(అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు)

ఇక ఇరాన్‌ చర్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. ప్రపంచంలో ఎక్కడలేనటువంటి.. అత్యంత శక్తిమంతమైన మిలిటరీ వ్యవస్థ తమ వద్ద ఉందని.. గురువారం ఉదయం ఓ ప్రకటన చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఇరాక్‌లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాలపై క్షిపణి దాడి చేయడాన్ని ఇరాన్‌ సమర్థించుకుంది. ఆత్మరక్షణ కోసమే ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపింది. అంతేకాదు తమ పౌరుల రక్షణ కోసం ఎంతదాకా వెళ్తామని అమెరికాకు కౌంటర్ ఇచ్చింది. ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా విరోధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా సైన్యాలు ఇరాన్‌ జనరల్‌ ఖాసిం సులేమానిని హతమార్చిన నేపథ్యంలో.. ఇరాన్‌ ప్రతీకారంగా క్షిపణి దాడులు చేసింది. దీంతో మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా