సంచలన ప్రకటన.. అమెరికాకు షాక్‌

23 Apr, 2018 09:07 IST|Sakshi

న్యూయార్క్‌ : అణు ఒప్పందాల విషయంలో ఇరాన్‌ సంచలన ప్రకటన చేసింది. అణు ఒప్పందం నుంచి తప్పుకుంటే.. తాము అణు పరీక్షలను మొదలుపెడతామని అమెరికాకు షాకిచ్చింది. ఈ మేరకు యూఎస్‌ పర్యటనలో ఉన్న ఇరాన్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ జావెద్‌ జరీఫ్‌ ప్రకటించారు. ఆదివారం న్యూయార్క్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...

‘ఇరాన్‌, అగ్ర దేశాల(చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా, జర్మనీ) మధ్య 2015లో అణు ఒప్పందం కుదిరింది. అయితే అణు ఒప్పందాన్ని పాటించటంలో అమెరికా విఫలం అయ్యింది. ఒప్పందం ప్రకారం మేం అణు పరీక్షలకు దూరంగా ఉన్నాం. కానీ, ఇప్పుడు అమెరికా ఒప్పందం నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తోంది. వారు గనుక ఆ పని చేస్తే మేం అణు పరీక్షలు నిర్వహించటం మొదలుపెడతాం. అణు బాంబులను తయారు చేస్తాం’ అని హెచ్చరించింది. అణు ఒప్పందం తర్వాత.. 2016లో ఒబామా హయాంలో అణు సంబంధిత ఆంక్షల ఎత్తివేత షరతు మేరకు ఇరాన్‌-అమెరికాల మధ్య మరో ఒప్పందం కూడా జరిగింది. కానీ, అమెరికా మాత్రం అన్ని ఒప్పందాలను ఉల్లంఘిస్తూ వస్తోందని ఇరాన్‌ ఆరోపిస్తోంది.  

ఇరాన్‌ వార్నింగ్‌పై అమెరికా మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యూయేల్‌ మాక్రోన్‌.. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశమై ఇరాన్‌ హెచ్చరికలపై చర్చించారు. ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉంటేనే మంచిదని.. అలా అయితే ఇరాన్‌ను కట్టడి చేయొచ్చని ఆయన ట్రంప్‌కు సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు అణు ఒప్పందంపై ఓ నిర్ణయానికి రావాలంటూ యూరోపియన్‌ యూనియన్‌ దేశాలకు అమెరికా అల్టిమేటం(మే 12వ తేదీ) ప్రకటించింది.

అణుఒప్పందానికి భారత్ స్వాగతం

మరిన్ని వార్తలు