జాగ్రత్త పడకపోతే.. వినాశనమే 

18 Mar, 2020 02:44 IST|Sakshi
జర్మనీలోని ఎర్‌ఫర్ట్‌ పట్టణంలో కరోనా వైరస్‌ ఆకృతిలో తయారుచేసిన కేక్‌లు

పౌరులకు ఇరాన్‌ హెచ్చరిక

ఆగస్ట్‌ దాకా ప్రభావం ఉండొచ్చు: ట్రంప్‌ 

టెహ్రాన్‌/వాషింగ్టన్‌: ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే కోవిడ్‌తో దేశవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోయే ప్రమాదముందని ఇరాన్‌ హెచ్చరించింది. అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని, ఆరోగ్య సూచనలను విధిగా పాటించాలని, లేదంటే, కనీవినీ ఎరగని ప్రాణ నష్టం జరిగే ప్రమాదముందని దేశ పౌరులకు సూచించింది. మధ్య ప్రాచ్యంలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 90% ఇరాన్‌లోనే నమోదవుతున్నాయి. ఇరాన్‌లో 988 మంది చనిపోగా, 16 వేల కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలపై టెహ్రాన్‌కు చెందిన ప్రతిష్టాత్మక షరీఫ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ చేపట్టిన అధ్యయన వివరాలను ఇరాన్‌ అధికార టీవీ జర్నలిస్ట్‌ డాక్టర్‌ అఫ్రుజ్‌ ఎస్లామి మంగళవారం వెల్లడించారు.

ఆ అధ్యయనం మూడు పరిస్థితులను అంచనా వేసింది. అవి..
►1. దేశ పౌరులు  పూర్తిగా సహకరిస్తే.. ఈ వైరస్‌ బారిన 1.2 లక్షల మంది పడతారు. 12 వేల మంది చనిపోతారు.
►2. పౌరులు సాధారణ స్థాయిలో సహకరిస్తే.. 3 లక్షల కేసులు నమోదవుతాయి. 1.1 లక్షల మంది చనిపోతారు.
►3. ఒకవేళ, పౌరులు సహకరించకుండా, జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే 40 లక్షల మందికి ఈ వైరస్‌ సోకుతుంది. 35 లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు’. ఇరాన్‌లో 250 మంది భారతీయులకు వైరస్‌ సోకిందన్న వార్తను నిర్ధారించలేమని భారత్‌ తెలిపింది.

ఆగస్ట్‌ వరకు ఈ సంక్షోభం 
కరోనా వైరస్‌ సంక్షోభం ఆగస్ట్‌ వరకు కొనసాగే ప్రమాదముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో సోమవారం సాయంత్రానికి కరోనా కారణంగా 85 మంది చనిపోగా, 4500 నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాల్లో దాదాపు 60 లక్షల మంది ప్రజలను ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా 1.82 లక్షల కోవిyŠ కేసులు నమోదవగా, 7,100 మరణాలు సంభవించాయి. కరోనా భయంతో ఐక్యరాజ్య సమితి కూడా పలు సమావేశాలను రద్దు చేసుకుంది. ఐరాస న్యూయార్క్‌ కార్యాలయంలోని ఒక ఉద్యోగికి కూడా కోవిడ్‌ నిర్ధారణ అయింది.

పాక్‌లో తొలి మరణం 
కరోనా కారణంగా పాకిస్తాన్‌లో మంగళవారం తొలి మరణం నమోదైంది. లాహోర్‌కు 150 కి.మీ.ల దూరంలోని హఫీజాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి కోవిడ్‌తో మరణించారు. పాకిస్తాన్‌లో మంగళవారం వరకు 193 కేసులు నమోదయ్యాయి. వీటిలో సింధ్‌ ప్రాంతంలోనే 155 కేసులు నిర్ధారణ అయ్యాయి.

వుహాన్‌లో ఒకే కేసు 
కరోనా వైరస్‌ తొలి కేంద్రమైన చైనాలోని వుహాన్‌ నగరంలో సోమవారం ఒక్క కేసు మాత్రమే కొత్తగా నమోదైంది. అయితే, చైనా వ్యాప్తంగా కరోనా కారణంగా సోమవారం చనిపోయిన 13 మందిలో వుహాన్‌కు చెందిన వారే 12 మంది ఉన్నారు. చైనాలో మొత్తం మృతుల సంఖ్య 3226కి చేరింది.

మరిన్ని వార్తలు