అమెరికాది అవివేకపు చర్య : ఇరాన్‌

3 Jan, 2020 12:25 IST|Sakshi

టెహ్రాన్ : బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా బలగాలు రాకెట్‌ దాడి జరపడాన్ని ఇరాన్‌ అవివేకపు చర్యగా అభివర్ణించింది. ఇరాన్‌ ఖడ్స్‌ ఫోర్స్‌ అధిపతి ఖాసీం సోలెమన్‌ను చంపాడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ దాడి భయంకరమైనదని ఇరాన్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ జావేద్‌ జరీఫ్‌ అన్నారు. అమెరికా చర్యను అంతర్జాతీయ ఉగ్రవాదంగా పేర్కొన్నారు. ఈ వంచన చర్యతో ఎదురయ్యే పరిణామాలకు అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇరాన్‌లో అమెరికా ప్రయోజనాలను చూస్తున్న స్విస్‌ దౌత్యకార్యాలయానికి సమన్లు పంపారు. అలాగే మూడు రోజులపాటు సంతాప దినాలను ప్రకటించారు.

మరోవైపు ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతోల్లా అలీ ఖమేనీ అమెరికా చర్యను తీవ్రంగా ఖండించారు. సోలెమాన్‌ హత్యకు తీవ్ర ప్రతీకారం తప్పదని అమెరికాను హెచ్చరించారు. కాగా, శుక్రవారం బాగ్దాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై అమెరికా జరిపిన రాకెట్‌ దాడిలో ఇరాన్‌ క్వాడ్స్‌ ఫోర్స్‌ అధిపతి జనరల్‌ ఖాసీం సోలెమన్‌, ఇరాక్‌ మిలీషియా కమాండర్‌ అబూ మహదీ అల్‌ ముహండిస్‌తోపాటు మరో ఆరుగురు మృతిచెందారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని పెంటగాన్‌ వెల్లడించింది.

చదవండి : ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్‌ దాడి.. 8 మంది మృతి

ట్రంప్‌ ఆదేశాలతోనే దాడి : వైట్‌ హౌస్‌

మరిన్ని వార్తలు