సొంత నౌక‌పై క్షిప‌ణిని ప్ర‌యోగించిన ఇరాన్‌

11 May, 2020 14:32 IST|Sakshi

టెహ్రాన్: నావికాద‌ళాలు విన్యాసాలు చేస్తున్న స‌మ‌యంలో ఇరాన్ పొర‌పాటున త‌న‌‌ స్వంత నౌక‌ను పేల్చేసింది. ఈ ఘ‌ట‌న‌లో 19 మంది మృతి చెందగా 15 మంది గాయ‌ప‌డ్డారు. అయితే మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. శిక్ష‌ణ‌లో భాగంగా ఆదివారం మ‌ధ్యాహ్నం ప‌ర్షియ‌న్ గ‌ల్ఫ్ జ‌లాల ప్రాంతంలో ఇరాన్ యుద్ధ నౌక జ‌మ‌రాన్ క్షిప‌ణిని ప్ర‌యోగించింది. ఆ క్షిప‌ణి స‌రిగ్గా అదే స‌మ‌యంలో అటుగా వెళ్తున్న కొన‌రాక్ అనే నౌక‌ను పొర‌పాటున టార్గెట్ చేసి పేల్చేసింది. ఈ దాడిలో గాయ‌ప‌డిన సిబ్బందిని సిస్తాన్‌, బలూచిస్తాన్ ఆసుప‌త్రిలో చేర్చి చికిత్స అందిస్తున్న‌ట్లు ఫ్రావిన్స్ మెడిక‌ల్ యూనివ‌ర్సిటీ వైద్యుడు మ‌హ‌మ్మ‌ద్ మెహ్రాన్ తెలిపారు. (ఆ విమానాన్ని మా రెండు క్షిపణులు కూల్చాయి: ఇరాన్‌ )

అయితే ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో నౌక‌లో ఎంత‌మంది సిబ్బంది ఉన్నార‌నేది స్ప‌ష్టంగా తెలియ‌రాలేదు. కాగా నెద‌ర్లాండ్స్ త‌యారు చేసిన‌ కొన‌రాక్ నౌక‌ను 1979 సంవ‌త్స‌రం క‌న్నా ముందే ఇరాన్ కొనుగోలు చేసింది. ఆ నాటి నుంచి దీని సేవ‌ల‌ను వినియోగించుకుంటోంది. ఇదిలా వుండ‌గా ఈ ఏడాది తొలినాళ్ల‌లో టెహ్రాన్ స‌మీపంలో ఉక్రెయిన్‌కు చెందిన ఎయిర్ లైన్స్ విమానాన్ని సైతం ఇరాన్‌ పొర‌పాటున పేల్చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక అమెరికా నౌక‌ల‌కు అడ్డు త‌గిలితే ఇరాన్ నౌక‌ల‌ను కాల్చి పారేయాలంటూ అగ్ర‌రాజ్య అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలివ్వ‌గా ఇరాన్ త‌న సొంత నౌక‌పైనే క్షిప‌ణి ప్ర‌యోగించింది. (కాల్చిపారేయండి: ట్రంప్‌ వార్నింగ్‌)

>
మరిన్ని వార్తలు